నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 18 : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లోని యువ టూరిజం క్లబ్ సభ్యులకు పర్యాటక రంగంపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా టూరిజం, ఇన్ఫర్మేషన్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా 2047 వికసిత్ భారత్, రైజింగ్ తెలంగాణ లక్ష్యాల సాధనలో భాగంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయి పోటీలను ఐదు కేటగిరీల్లో నిర్వహించనున్నారు. మొదటి కేటగిరీలో షార్ట్‌ఫిల్మ్, రీల్ కాంపిటీషన్ ద్వారా పర్యాటక ప్రాంతాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం, రెండో కేటగిరీలో సాంగ్స్, డ్యాన్స్, డ్రామా, స్కిట్స్, మూడో కేటగిరీలో ఆర్ట్స్, క్రాఫ్ట్స్, నాలుగో కేటగిరీలో పర్యాటక ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు సంబంధించిన అంశాలు, ఐదో కేటగిరీలో హెరిటేజ్ వాక్, ఫుడ్ ఫెస్టివల్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 22న నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులు అదే రోజు ఉదయం 8.30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయి జిల్లా పోటీలను సెప్టెంబర్ 24న దేవరకొండ ఖిల్లా వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు అక్బర్ అలీ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు నాగార్జున ప్రభుత్వ కళాశాల ఉపాధ్యాయులు నర్సింగ్‌ను 9985930885, 8074487020 నంబర్లలో సంప్రదించవచ్చు. పాఠశాల స్థాయి సమాచారం కోసం టూరిజం అడ్వైజర్ ఫర్హాన్‌ను 9966459755 నంబర్లో సంప్రదించాలని జిల్లా టూరిజం, ఇన్ఫర్మేషన్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ సూచించారు.