– పరాకాష్టకు అధికార దుర్వినియోగం
– పచ్చని పొలాలు ఎండిపోతుంటే పట్టించుకోని అమాత్యుడు
– నిరుద్యోగులను మభ్య పెట్టేందుకే ఈ ప్రహసనం
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, సెప్టెంబర్ 18 : నిరుద్యోగులకు ప్రతి నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు బలవంతపు వసూళ్లతో ‘జాబ్ మేళా’ నిర్వహిస్తూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కోదాడలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జాబ్ మేళాలో తొలుత 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ తర్వాత 3,500 అని, తీరా చూస్తే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలను తెచ్చి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. సింగరేణి, మినరల్ ఫండ్స్, సిమెంట్ ఫ్యాక్టరీల నుండి బలవంతంగా నిధులు వసూలు చేసి ఈ కార్యక్రమాన్ని తమ సొంత ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు. క్రింది స్థాయి ఉద్యోగి నుండి కలెక్టర్ స్థాయి వరకు, పోలీసు యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారులను వాడుకుని పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చుకుంటూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత శాఖలోనే అవినీతికి తెరలేపారన్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఉన్న లష్కర్ పోస్టులను ఒక్కొక్కటి రూ.3 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తొలగించి, కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల ద్వారా కొత్త వారిని తీసుకుంటున్నారని తెలిపారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో సాగునీరు, కరెంటు లేక పచ్చని పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేడని, కనీసం రైతుల ఆక్రందనలను కూడా పట్టించుకోవట్లేదని విమర్శించారు. స్థానికంగా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. మిల్లుల యాజమాన్యాల వద్ద బస్తాకు రెండు రూపాయల చొప్పున కమీషన్లు వసూలు చేయడానికే మంత్రి, ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన లాకప్ డెత్ ఘటనలో బాధ్యులైన పోలీసు అధికారులను రక్షించి, ఒక బీసీ వర్గానికి చెందిన ఇన్స్పెక్టర్ని బలిపశువును చేశారన్నారు. లాకప్ డెత్ కు గురైన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో గ్రామాలను దత్తత తీసుకుంటామని చెప్పి, గెలిచిన తర్వాత కనీసం ఒక బడి, గుడి లేదా కనీసం ఒక బోరుబావి కూడా వేయించలేదని గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యలను గాలికొదిలేసి కేవలం ఒక టూరిస్ట్ ఎమ్మెల్యేలా నియోజకవర్గానికి వచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. సొంత ప్రయోజనాలు, కమీషన్ల కోసం పని చేస్తున్న ఉత్తమ్ దంపతుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. మెగా జాబ్ మేళాకు హాజరవుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ పోలీస్ కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు ఎస్కే నయీమ్, భూపాల్ రెడ్డి, జానకి, రామాచారి, ఆంజనేయులు, తొగరు రమేష్ పాల్గొన్నారు.