Chiranjeevi | తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా తనదైన మాస్ యాక్షన్, ఎనర్జిటిక్ డాన్సులతో ప్రేక్షకులను అలరిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టార్ పవర్‌ను చాటుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారుతున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్ మాస్ ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమా అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమైంది. అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాయి.
ఈ విజయోత్సాహంలోనే మెగాస్టార్ తన తదుపరి ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో చిరంజీవి తన 158వ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఈ చిత్రానికి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ‘దసరా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కూడా చిరంజీవి సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఆయన నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి–శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ రెండు సినిమాల తర్వాత కూడా మెగాస్టార్ మరో ఆసక్తికరమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘పుష్ప’ చిత్రాలతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు పొందిన సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందని తెలుస్తోంది. పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంతో ఈ కథ రూపొందనుందట. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చిరంజీవి సినిమా చేసి చాలా కాలం కావడంతో ఈ కథ ఆయనకు కొత్తగా అనిపించి వెంటనే అంగీకరించారని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా వెంటనే ప్రారంభం అయ్యే అవకాశం లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందని సమాచారం. ఇక 70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టడం మెగాస్టార్ ప్రత్యేకతగా చెప్పాలి.