హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు పొందిన తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించే అంశాన్ని జీఆర్ఎంబీ (GRMB )సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు (Harish Rao ) తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు జలశక్తి మంత్రికి, సెక్రటరీకి రాసిన లేఖను విడుదల చేశారు .
కేంద్రం ఇప్పటికే చట్టబద్ధంగా ఇచ్చిన అనుమతులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమీక్షించడం సరికాదన్నారు. అజెండా లో పేర్కొన్న అంశాలను ఉపసంహరించు కోవాలని, పెండింగ్‌లో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని పలు భారీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక, హైడ్రోలాజికల్, ఇంజనీరింగ్, పర్యావరణ, చట్టపరమైన అంశాలను కేంద్ర జల సంఘం , జలశక్తి మంత్రిత్వ శాఖలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థలు చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చిన తర్వాత, ఆ నిర్ణయాలను మళ్లీ సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం గోదావరి బోర్డు లాంటి కింది స్థాయి సంస్థకు ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను మళ్లీ సమీక్షించేందుకు జీఆర్ఎంబీకి అవకాశం ఇస్తే, అది కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యతను తగ్గించినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలోని కాళేశ్వరం, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి, ముక్తేశ్వరం, చనాక-కొరట, మోడికుంటవాగు, కడెం-గూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ ప్రక్రియ తర్వాతే అనుమతులు వచ్చాయని, ఇప్పుడు వాటిని మళ్లీ సమీక్షించాలని ఎజెండాలో పెట్టడం సరికాదని పేర్కొన్నారు. దీని వల్ల తెలంగాణలో సాగునీటి అభివృద్ధి కుంటుపడటంతో పాటు, కోట్లాది మంది రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఇప్పటికే హైడ్రోలాజికల్ అనుమతులు పొందిన సమ్మక్క సాగర్ ఎత్తిపోతల పథకానికి మిగిలిన చట్టబద్ధమైన అనుమతులను కూడా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం సకాలంలో జోక్యం చేసుకుని తెలంగాణ నీటి హక్కులను కాపాడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.