Grapes | ద్రాక్ష పండ్లను పండ్ల రాణిగా పిలుస్తారు. రుచికరమైన తీపి, స్వల్ప పులుపు కలిగిన ఈ పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పచ్చ, ఎరుపు, నీలం, ఊదా, నలుపు వంటి వివిధ రంగుల్లో లభించే ద్రాక్షను ఎక్కువగా వైన్ తయారీలో ఉపయోగిస్తారు. మిగిలిన వాటిని నేరుగా పండ్లుగా లేదా ఎండు ద్రాక్ష తయారీలో వినియోగిస్తారు. ఏడాది పొడవునా మార్కెట్లో లభించే ఈ పండ్లు పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ద్రాక్షలో కెరోటినాయిడ్లు, పాలీఫినాల్స్ వంటి అనేక రకాల ఫైటోన్యూట్రియెంట్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయని తేలింది. ముఖ్యంగా ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రోల్ అనే పాలీఫినాల్ రక్తనాళాలను విస్తరింపజేసి రక్తప్రసరణను మెరుగుపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ద్రాక్ష గింజలు, తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి.
ద్రాక్షలోని రెస్వెరాట్రోల్ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించడానికి తోడ్పడటంతోపాటు కొన్ని చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం బెంజాయిల్ పెరాక్సైడ్ అనే సాధారణ మొటిమల మందుతో కలిపి ఉపయోగించినప్పుడు రెస్వెరాట్రోల్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాపై ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. 100 గ్రాముల ద్రాక్షలో సుమారు 191 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. పొటాషియం అధికంగా తీసుకోవడం, సోడియం వినియోగాన్ని తగ్గించడం వల్ల రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం శరీరంలోని అదనపు సోడియం ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. తక్కువ ఉప్పు, ఎక్కువ పొటాషియం ఉన్న ఆహారం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.
ద్రాక్ష కళ్ల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల కళ్లలోని రెటీనాను రక్షించే ప్రొటీన్ల స్థాయి పెరగడంతోపాటు వాపులకు సంబంధించిన ప్రొటీన్ల స్థాయి తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. దీంతో కళ్ల పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి కూడా ద్రాక్ష ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. రెస్వెరాట్రోల్ మెదడుకు రక్తప్రసరణను పెంచి ఆలోచనా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల్లో ఏర్పడే ప్లాక్‌లు, ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఇది తోడ్పడుతుంది. ప్రతిరోజూ ద్రాక్షను తినడం వల్ల మోకాళ్ల నొప్పి, ముఖ్యంగా ఆస్టియోఆర్థ్రైటిస్ కారణంగా వచ్చే నొప్పి కొంతవరకు తగ్గుతుంది. ద్రాక్షలో ఉండే పాలీఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కీళ్ల వంపుతనం, కదలికలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ద్రాక్షలో ఉండే కొన్ని ఎంజైమ్‌లు శరీరంలో వాపులను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో ధమనుల ఆరోగ్యాన్ని కాపాడడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో, శరీర కణాల మరమ్మత్తు ప్రక్రియలకు మద్దతు ఇవ్వడంలో ఇవి సహాయపడతాయి.
ద్రాక్షలో విటమిన్ ఎ, విటమిన్ బి 6, విటమిన్ బి 12, విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. అయితే వీటిలో సహజ చక్కెర కూడా ఉండటం వల్ల అతిగా తినకూడదు. వారానికి మూడు నుంచి నాలుగు రోజులు వివిధ రకాల బెర్రీ పండ్లను ఆహారంలో చేర్చడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ద్రాక్షనే ప్రత్యేకంగా తింటే రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు తీసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఒక కప్పులో సుమారు 15 నుంచి 20 ద్రాక్ష పండ్లు ఉంటాయి. ద్రాక్షను నేరుగా పండ్లుగా తినడమే కాకుండా ఫ్రూట్ సలాడ్లు, సమ్మర్ సలాడ్లు, డెజర్ట్‌లు, టార్ట్స్, పన్నాకొట్టా, కేకులు, చట్నీలు, సాస్‌లు, కంపోట్స్, మాక్టెయిల్స్, సార్బెట్లు వంటి అనేక వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు. చికెన్‌తో కలిపి వండడం లేదా నల్ల ద్రాక్షతో సలాడ్ డ్రెస్సింగ్ తయారు చేయడం వంటి వినూత్న వంటకాల్లో కూడా ద్రాక్షను వినియోగిస్తారు.