పైసలు పెట్టొద్దు..వడ్లు కొనొద్దు!
ఈ సీజన్ ధాన్యం కొనుగోళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదా? అందుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నదా? బోనస్‌తోపాటు ఆర్థికభారం నుంచి తప్పించుకొనే సంకుచిత ఆలోచన చేస్తున్నదా? అందుకే 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి ఇప్పటికీ కేవలం ఒక లక్ష టన్నుల లోపే కొన్నదా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ధాన్యం కొనండి మహాప్రభో అంటూ కొనుగోలు కేంద్రాలకు కుప్పలు తెప్పలుగా ధాన్యం రాసులు పోసి ఎదురు చూస్తున్నారు.
- ధాన్యం కొనుగోళ్లపై సర్కార్ తొండాట.. కొనకుండా నిధులు మిగిల్చే యోచన
- కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం.. బయటే ఎక్కువ ధర ఉన్నదని బుకాయింపు
- 65 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు లక్ష్యం.. నేటికి లక్ష టన్నులు కూడా దాటని వైనం
- కేంద్రాల్లో వడ్లు పోసి రైతుల ఎదురుచూపు.. నెలల తరబడి కాంటా కోసం పడిగాపులు
- కొనుగోళ్లు తగ్గించి బోనస్‌తో పాటు ఆర్థిక భారం తప్పించుకునే యోచనలో సర్కార్
హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): ఈ సీజన్ ధాన్యం కొనుగోళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదా? అందుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నదా? బోనస్‌తోపాటు ఆర్థికభారం నుంచి తప్పించుకొనే సంకుచిత ఆలోచన చేస్తున్నదా? అందుకే 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి ఇప్పటికీ కేవలం ఒక లక్ష టన్నుల లోపే కొన్నదా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ధాన్యం కొనండి మహాప్రభో అంటూ కొనుగోలు కేంద్రాలకు కుప్పలు తెప్పలుగా ధాన్యం రాసులు పోసి ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం కాంటా పడుతలేదు, కొనుగోళ్లు చేయడం లేదు. పలుచోట్ల అన్నదాత రోడ్డెక్కి మొత్తకుంటున్నా సర్కార్‌లో కదలిక రావడమే లేదు. ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి నిన్న, మొన్నటి వరకు బహిరంగ మార్కెట్లో ధర ఉన్నదని సాకులు చెప్పిన సర్కార్.. కొనుగోళ్ల నుంచి తప్పించుకోనే ప్రయత్నంలోనే ఉన్నదనే విమర్శలున్నాయి. ఇప్పుడు ప్రైవేట్‌లో ధర తగ్గినా ప్రభుత్వం కొనుగోళ్లలో వేగం పెంచకుండా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నది. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వెనుక పెను కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌పై భారం మోపి, ఈ సీజన్లో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ధాన్యమే కొనాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. రైతులు నష్టపోయినా సరే.. ఖజానాకు నష్టం రావొద్దనే భావనతోనే ప్రభుత్వ పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వేల కోట్లు మిగిలినట్టేనా?
ఈ వానకాలంలో 57.70 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 119.57 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 65 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇందుకోసం రూ.18,250 కోట్ల నిధులు అవసరం అవుతాయని లెక్కలేసింది. ఇప్పటికే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొనేందుకు చర్యలూ చేపట్టింది. ఆ అప్పులు మంజూరైనా వాటిని తీసుకోవడం లేదని తెలిసింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ నుంచి రుణం కూడా మంజూరైంది. అయినా సివిల్ సైప్లె ఆ రుణాలను విత్‌డ్రా చేయడమూ లేదని తెలిసింది. ధాన్యం కొనుగోళ్లను తగ్గించడమే ఇందుకు కారణమనే చర్చ జరుగుతున్నది. అడ్డగోలుగా రుణం తీసుకొని ధాన్యం కొనుగోలు చేయొద్దని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్టు చర్చించుకుంటున్నారు. అందుకే సివిల్ సైప్లె అధికారులు సైతం ఆచితూచి రుణం తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ధాన్యం కొనుగోలుకు రూ.18,250 కోట్లు కేటాయించినా అందులో సగం విలువైన ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని తెలిసింది. తద్వారా ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో కోత పెట్టడం వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నిధులు మిగులుతాయనే ప్రచారం జరుగుతున్నది.
సగం కేంద్రాలూ ప్రారంభించని వైనం
ఈ సీజన్లో 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కనీసం 5 వేల కేంద్రాలను కూడా ప్రారంభించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రారభించిన లెక్కలన్నీ పేపర్లపై ఉండగా, చాలా చోట్ల కొనుగోళ్లు మొదలుపెట్టనేలేదు. పలుప్రాంతాల్లో ప్రారంభించి వదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే కొనుగోళ్లు కూడా ఉన్నాయి. వాస్తవానికీ ఇదే సమయానికి దాదాపు 25 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయాలి. కానీ కొనుగోళ్లు ఇప్పటివరకు లక్షల టన్నులు కూడా దాటకపోవడం విమర్శలకు బలం చేకూర్చుతున్నది.
కడుపుమండిన రైతన్న
కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యం కుప్పలుగా పోసి కొండకు ఎదురు చూసినట్టుగా ఎదురు చూస్తున్నారు. ధాన్యం కాంటా పెట్టాలంటూ అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నారు. చివరికి విసుగొచ్చి సర్కార్‌పై ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. సర్కార్‌పై నిరసనగా ధాన్యం రోడ్లపై పోసి వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని అన్నదాతలు దుమ్మెత్తి పోస్తున్నారు.
రైతులకు నష్టమొచ్చినా సరే.. సర్కార్‌పై భారం పడొద్దు?
కరువు, సాగునీటి కొరత, కరెంట్ కోతలతో ఇప్పటికే రైతాంగం నష్టాలను మూటగట్టుకుంటున్నది. ఈ దశలో రైతులను ఆదుకోవాల్సిన సర్కార్.. ఏ మాత్రం కనికరం చూపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు పంటనష్ట పరిహారం కింద నయా పైసా ఇవ్వలేదు. కనీసం కష్టనష్టాలతో పండించిన పంటనైనా కొనుగోలు చేస్తుందేమో అనుకుంటే అది కూడా చేయకుండా రైతులను మరింత నష్టాల్లోకి నెడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్ ఖజానాపై భారం పడొద్దనే ధాన్యం కొనుగోళ్లలో కోత పెట్టాలనే సర్కార్ ఆలోచనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు నష్టమైనా సరే.. ప్రభుత్వంపై ఆర్థికభారం పడొద్దనే ఆలోచనపై రైతులు విరుచుకుపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచన లేకపోతే ధాన్యం కొనుగోళ్లలో ఎందుకు తాత్సారం చేస్తున్నది, ఎందుకు ధాన్యం కాంటా పెట్టడంలేదని ప్రశ్నిస్తున్నారు.
నెల సంది ఈన్నే ఈడిగిలవడ్డ
నా వడ్లు గల్లర గల్లర ఎండినయి. కానీ, సార్లొచ్చి వడ్లు పట్టకపోతే కొనమన్నరు. మళ్ల వాట్ని పట్టియ్యాల్నంటే పైసలుగావాలే. చేసిన కట్టమంతా ఈన్నే ఉండే. యాడికెల్లి తేవాలే. తిక్క లేసింది. ఇగ మిల్లుకు కొట్టిన. రూ.2,400కు క్వింటా చొప్పున 45 కింటాళ్లమ్మిన. ఇగ వడ్లు తూర్పార వడితే కూలీలకు పైసలు కావలెకదా? మీది పైసలు పోతెవానాయెగానీ నా తిప్పలు తప్పినయ్. నెల సంది ఈన్నే ఈడిగిలవడ్డ. కొంటమన్నోళ్లు లేరు. మా బాధ ఇనెటోళ్లు లేరు.
తమ్మనవేణి రాజయ్య, దుర్శేడ్
మద్దతు ధరకంటే తక్కువే
ఇక్కడ ట్రాక్టర్లో ధాన్యం లోడ్ చేస్తున్న రైతు కరీంనగర్ రూరల్ మండలం దర్శేడ్కు చెందిన సుంకిశాల కిషన్‌రావు. కేఎన్ఎం 1638 కూనారం సన్నాలు పండించి 20 రోజుల కిందటే కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టాడు. ప్రభుత్వం విధించిన ఎఫ్ఏక్యూ నాణ్యత ప్రమాణాలు వచ్చాయి. కానీ, వడ్లలో డస్ట్ క్లీన్ చేయాలని అధికారులు చెప్పడంతో విసిగిపోయాడు. వెంటనే మిల్లర్‌తో క్వింటాకు రూ.2,800 చొప్పున మాట్లాడుకున్నాడు. గత బుధవారం ట్రాక్టర్ తెప్పించి లోడ్ చేసుకుని తీసుకెళ్లాడు. సుమారు 40 క్వింటాళ్ల సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించుకుంటే బోనస్‌గా రూ. 20 వేలు వచ్చేవి. కానీ, కనీస మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకోవడంతో 40 క్వింటాళ్లపై రూ.6 వేలకుపైగా నష్టపోయాడు. ఇదే కేంద్రం నుంచి తనకంటే ముందు పదిమంది రైతులు ధాన్యాన్ని మిల్లులకు అమ్ముకున్నారని కిషన్‌రావు చెప్పడం చూస్తే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థమవుతుంది.
ప్రైవేట్‌పైనే భారం.. సర్కార్ ద్రోహం
ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లను కాంగ్రెస్ సర్కార్ అనధికారికంగా ప్రైవేట్‌కు వదిలేసి తీరని ద్రోహం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో సాగునీళ్లు, కరెంట్ కొరత నేపథ్యంలో యాసంగిలో పంటలు సాగు చేసే పరిస్థితి లేక ధాన్యానికి తొలుత డిమాండ్ పెరిగింది. సన్నాల ధరలు ఒక దశలో రూ.5 వేల వరకు పలికింది. దొడ్డు రకానికి సైతం 2,500 నుంచి రూ.3వేల వరకు ధర పలికింది. ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు వారికి సరిపడా కొనుగోళ్లు పూర్తికావడంతో బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గిపోయాయి. మద్దతు ధర క్వింటాలుకు రూ.2,461 ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.2వేల నుంచి రూ.2,200 వరకే ధర ఉన్నది. సన్నాలు సైతం 2,500 నుంచి 3వేల వరకే ధర పలుకుతున్నది. దీంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభించకపోవడం, ఒకవేళ ప్రారంభమైనా కాంటా పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై ఆశలు చచ్చిపోయి నష్టమైనా సరే అంటూ తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకొచ్చిన రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకే విక్రయిస్తుండటం ఈ సర్కార్ వైఫల్యానికి నిదర్శమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

