ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్వీర్యం!
మానవ హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను కాపాడేందుకు ఏర్పాటైన సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమపద్ధతిలో బలహీనపరిచిందని అంతర్జాతీయ ప్రభుత్వేతర నిఘా సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) తన తాజా నివేదికలో పేర్కొన్నది. మంగళవారం విడుదల చేసిన 95 పేజీల నివేదికలో భారత్‌లో నిరంకుశ ధోరణి మరింత లోతుగా పెరిగిందని తెలిపింది. ‘మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రజాస్వామ్యం ఏమిటి?
- సంక్షోభంలో ఎన్నికల సంఘం విశ్వసనీయత
- దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
- ప్రజాస్వామిక నిరసనలపై ఉక్కుపాదం
- న్యాయ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ జోక్యం
- మోదీ సర్కార్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శలు
న్యూఢిల్లీ, నవంబర్ 24: మానవ హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను కాపాడేందుకు ఏర్పాటైన సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమపద్ధతిలో బలహీనపరిచిందని అంతర్జాతీయ ప్రభుత్వేతర నిఘా సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) తన తాజా నివేదికలో పేర్కొన్నది. మంగళవారం విడుదల చేసిన 95 పేజీల నివేదికలో భారత్‌లో నిరంకుశ ధోరణి మరింత లోతుగా పెరిగిందని తెలిపింది. ‘మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రజాస్వామ్యం ఏమిటి?: భారత్‌లో మోదీ నిరంకుశ పాలనా వ్యూహం’ పేరిట విడుదలైన ఈ నివేదికలో పార్లమెంటరీ ప్రక్రియలను బలహీనపరచడం, ప్రతిపక్షాన్ని అణచివేయడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకోవడం, రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థలను నిర్వీర్యం చేయడం, న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడం వంటి అంశాలను హెచ్ఆర్డబ్ల్యూ పరిశీలించింది.

Modi
ఈసీ విశ్వసనీయతపై సంక్షోభం
చనిపోయినవారు, ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైనవారు, అనర్హులైన ఓటర్లను తొలగించాలనే ఉద్దేశంతో 2025 జూన్‌లో ప్రారంభించిన ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో ఎన్నికల జాబితాల నుంచి 2026 అక్టోబర్ నాటికి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారని హెచ్ఆర్డబ్ల్యూ పేర్కొన్నది. ఈ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు, ఏకపక్ష నిర్ణయాలు, పారదర్శకత లేమి ఉన్నాయని ఆరోపించింది. మహిళలు, పేదలు, మతపరమైన మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు అసమానంగా జాబితాల నుంచి తప్పించబడ్డారని తెలిపింది. ఎన్నికల సంఘం ‘భారీ విశ్వసనీయత సంక్షోభం’ ఎదుర్కొంటున్నదని నివేదిక పేర్కొన్నది.
బెంగాల్లో 90 లక్షల ఓట్ల తొలగింపు
2026 ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 90 లక్షల మంది పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారని హెచ్ఆర్డబ్ల్యూ పేర్కొన్నది. ఇది ఆ రాష్ట్ర ఓటర్లలో 12 శాతమని తెలిపింది. వారిని తర్వాత తిరిగి జాబితాల్లో చేర్చితే, అప్పటికి వారు ఓటు వేయకపోవడం ఆమోదయోగ్యమేనన్నట్లుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నది.
40 వేల భద్రతా సిబ్బంది మోహరించి..
సర్ ప్రక్రియను రద్దు చేసి, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేసినప్పుడు పరిపాలన యంత్రాంగం రాకపోకలపై ఆంక్షలు విధించిందని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది. మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేసి, ఢిల్లీలో 40,000 మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించి, వేలాది మందిని ఏకపక్షంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నది. పోలీసులు అధిక బలప్రయోగం చేశారని తెలిపింది. నిరసనలను ‘దేశ వ్యతిరేకం’గా చిత్రీకరించేందుకు ప్రసార మాధ్యమాల నెట్‌వర్క్‌లను ఉపయోగించడంతోపాటు, ప్రభుత్వాన్ని విమర్శించే ఆన్లైన్ కంటెంట్‌ను సెన్సార్ చేశారని ఆరోపించింది.
2023 చట్టం.. 146 మంది ఎంపీల సస్పెన్షన్
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై కార్యనిర్వాహక వర్గం నియంత్రణను బలోపేతం చేస్తూ, అధికారిక చర్యలు, ప్రకటనల విషయంలో వారికి విస్తృత చట్టపరమైన రక్షణ కల్పించే చట్టాన్ని ప్రభుత్వం 2023 డిసెంబర్లో తీసుకొచ్చిందని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది. లోక్‌సభకు చెందిన 100 మంది, రాజ్యసభకు చెందిన 46 మంది సభ్యులను మొత్తం సమావేశాల కాలానికి సస్పెండ్ చేసిన సమయంలో ఈ చట్టం ఆమోదం పొందిందని పేర్కొన్నది.

Police Attack
పార్లమెంట్‌ను పక్కనపెట్టిన తీరు
2014 నుంచి 2024 వరకు లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ పార్లమెంటరీ కమిటీలను పక్కనపెట్టిందని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది. కీలక ప్రతిపక్ష పదవులను ఏండ్ల తరబడి ఖాళీగా ఉంచిందని, బిల్లులను తప్పుగా మనీ బిల్లులుగా వర్గీకరించిందని పేర్కొన్నది. మనీ బిల్లులకు రాజ్యసభ ఆమోదం అవసరం ఉండదని, 2024 వరకు రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని వివరించింది.
ఉద్యమకారులపై యూఏపీఏ కేసులు
మానవ హక్కుల ఉద్యమకారులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఉపయోగించిందని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది. వీల్‌చైర్‌ను ఉపయోగించే ఉద్యమకారుడు జీఎన్ సాయిబాబాను 2014 మేలో అదుపులోకి తీసుకున్నారని, 2017లో దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించారని పేర్కొన్నది. ఆయనకు ఇంటి నిర్బంధం కల్పించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు 2022లో తిరస్కరించిందని తెలిపింది. విధానపరమైన కారణాలతోపాటు, విశ్వసనీయమైన కేసును రాష్ట్రం నిరూపించలేకపోయిందనే కారణంతో బాంబే హైకోర్టు ఆయనను 2024 మార్చిలో నిర్దోషిగా విడుదల చేసిందని పేర్కొన్నది.
బలహీనమైన నిఘా సంస్థలు
సాయిబాబా పట్ల జైలు అధికారులు వ్యవహరించిన తీరుపై పౌర సమాజం చేసిన ఫిర్యాదులను జైలు నివేదికల ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కొట్టివేసిందని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది. ఆయన నిర్బంధాన్ని ఐక్యరాజ్యసమితి నిపుణులు ‘సిగ్గుచేటు’గా అభివర్ణించినప్పటికీ కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నది.
విద్యార్థి నిరసనలపై బల ప్రయోగం
పేపర్ లీక్ కారణంగా వైద్య ప్రవేశ పరీక్షలను రద్దు చేసిన తర్వాత 2026 జులైలో విద్యార్థులు, ఇతరులపై భద్రతా బలగాలు అధిక బలప్రయోగం చేశాయని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది. నిరసనల్లో ఎక్కువ మంది విద్యార్థులే అయిన 100 మందికిపైగా గాయపడ్డార, పోలీసుల చేత లైంగిక వేధింపులు, దాడులు జరిగాయని పలువురు మహిళలు ఆరోపించారని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది.
ప్రభుత్వం చేయాల్సిందేమిటంటే..
విమర్శకులకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలను ఆయుధాలుగా వాడటం మానేసి, ప్రజాస్వామ్య రక్షణ వ్యవస్థలుగా వాటిని పునర్నిర్మించాలనిహెచ్ఆర్డబ్ల్యూ ప్రభుత్వాన్ని కోరింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో, వాణిజ్య, భద్రతా చర్చల్లో భారత్ మిత్రదేశాలు ఈ అంశాలను ప్రస్తావించాలని సూచించింది.
న్యాయ వ్యవస్థలో జోక్యం
న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పదోన్నతుల్లో కార్యనిర్వాహక వర్గం జోక్యం పెరుగుతున్నదని ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆరోపిస్తున్నట్టు హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది. పౌర స్వేచ్ఛ విషయంలో కార్యనిర్వాహక వర్గం హద్దులు దాటిందని, కానీ న్యాయవ్యవస్థ ఎదిరించి నిలబడలేదని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదన్ లోకూర్ వ్యాఖ్యానించినట్టు పేర్కొన్నది. 2020 నుంచి యూఏపీఏ కింద నిర్బంధంలో ఉన్న ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు జనవరి 5న బెయిల్ నిరాకరించిందని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది. జాతీయ భద్రతా చట్టం కింద ఆరు నెలలు నిర్బంధంలో ఉన్న వాతావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్, విద్యావేత్త అలీ ఖాన్ మహమూద్లపై కేసులను ప్రాసిక్యూటర్లు 2026 మార్చిలో ఉపసంహరించుకున్నారని తెలిపింది.
దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించిందని నివేదిక పేర్కొన్నది. విదేశీ నిధులు, ఆర్థిక చట్టాల కింద హక్కుల సంఘాలు, మీడియా సంస్థలను లక్ష్యంగా చేసిందని తెలిపింది. 2015 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు రాజకీయ నాయకులపై ఈడీ 193 కేసులు నమోదు చేసిందని, ఇందులో రెండు శిక్షలు పడ్డాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2025 మార్చిలో పార్లమెంట్‌కు తెలిపింది. అంతకుముందు పదేండ్లలో 26 మంది రాజకీయ నాయకులపై దర్యాప్తు జరగగా, ఇప్పుడు ఆ సంఖ్య 600 శాతానికిపైగా పెరిగిందని హెచ్ఆర్డబ్ల్యూ పేర్కొన్నది. లక్ష్యంగా చేసుకున్నవారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ప్రత్యర్థులేనని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

