Ind vs US : అగ్రరాజ్యం అమెరికా (USA) కు భారత్ (India) షాకిచ్చింది. అమెరికాతో కీలకమైన ఆయుధ కొనుగోలు ఒప్పందాలకు భారత్ తాత్కాలికంగా బ్రేకులు వేసింది. భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అదనంగా 25 శాతం సుంకాలను విధించడంతో ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.
తాజా పరిణామాలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. భారత్ తాజాగా తీసుకున్న అనూహ్య నిర్ణయంతో సుమారు 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30 వేల కోట్లు) విలువైన రక్షణ ఒప్పందాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇందులో భారత సైన్యం కోసం స్ట్రైకర్ యుద్ధ వాహనాలు, జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణులతోపాటు, నౌకాదళం కోసం ఆరు బోయింగ్ పీ-8I గూఢచార విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి.
ఈ ఒప్పందాలను ఖరారు చేసేందుకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో వాషింగ్టన్లో పర్యటించాల్సి ఉండగా తాజా నిర్ణయంతో ఆ పర్యటన రద్దయినట్టు సమాచారం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి భారత్ ఆర్థికంగా పరోక్షంగా సహకరిస్తోందని ఆగస్టు 6న డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. దాన్ని కారణంగా చూపుతూ భారత ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించారు. దాంతో మొత్తం సుంకాలు 50 శాతానికి చేరాయి.
అయితే ట్రంప్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా, ఐరోపా దేశాలు కూడా తమ ప్రయోజనాల కోసం రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నాయని, తమను మాత్రమే అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించింది. అమెరికా గనుక రష్యాలా సమాన ధరకు చమురును సరఫరా చేస్తే, రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ తెలిపింది. ట్రంప్ బెదిరింపు ధోరణి, దేశంలో పెరుగుతున్న అమెరికా వ్యతిరేక జాతీయవాదం కారణంగా ప్రధాని మోదీకి ఈ విషయంలో రాజకీయంగా ముందుకు వెళ్లడం కష్టంగా మారిందని, అందుకే తాజా నిర్ణయం తీసుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం, నిఘా సమాచార మార్పిడి, సంయుక్త సైనిక విన్యాసాలు యథావిధిగా కొనసాగుతున్నాయని భారత అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్.. ప్రధానంగా రష్యాపై ఆధారపడినా ఇటీవలి కాలంలో ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా నుంచి కొనుగోళ్లను పెంచింది.