LPG carrier : ఎల్పీజీ చమురు కలిగిన రెండో నౌక మంగళవారం గుజరాత్ పోర్టుకు చేరుకుంది. ఎల్పీజీ ట్యాంకర్లతో కూడిన ఎంటీ నందాదేవి అనే పేరుగల నౌక మంగళవారం గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నౌక హోర్ముజ్ జలసంధి నుంచి ఇక్కడికి రావడం విశేషం. ఇరాన్ యుద్ధం ప్రారంభమయ్యాక ఈ జలసంధి నుంచి ఇండియా చేరుకున్న రెండో నౌక ఇది. ఈ నౌకలో దాదాపు 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది.
ఈ నౌక నుంచి చమురును బదిలీ చేసే చర్యను వెంటనే ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీన్దయాల్ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్, నౌక వద్దకు చేరుకుని పరిస్తితిని సమీక్షించారు. నౌకలోని ట్యాంకర్ల నుంచి చమురును వెంటనే ఇక్కడి నౌకల్లోకి బదిలీ చేసి, చమురు యూనిట్లకు తరలించే ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు. జామ్నగర్ సమీపంలోని వాడినార్ పోర్టు నుంచి ఇండియా అవసరాలకు సరిపడా చమురు భారీ స్థాయిలో దిగుమతి అవుతుంటుంది. మన దేశానికి అవసరమైన చమురును అందించడంలో ఈ పోర్టు చాలా కీలకం. ఇటీవల హోర్ముజ్ జలసంధి మార్గంలో రెండు భారతీయ నౌకలను ఇరాన్ అనుమతించిన సంగతి తెలిసిందే.
శివాలిక్, నందా దేవి అనే నౌకలకు అనుమతించగా.. అందులో నందాదేవి ఇప్పుడు ఇండియా చేరుకుంది. శివాలిక్ నౌక సోమవారం ఇండియా చేరుకుంది. ఈ నౌకలో 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఇండియా చేరుకుంది. ఈ నౌకలు ఇండియా చేరుకునేందుకు ఇరాన్ తగిన సాయం అందించింది. ఇక 81,000 క్రూడాయిల్ కలిగిన జాగ్ లాడ్కి అనే నౌక ప్రస్తుతం మార్గమధ్యలో ఉంది. హోర్ముజ్ జలసంధి వద్ద ఇంకా 22 ఇండియన్ నౌకలు చిక్కుకున్నాయి.