కాళోజీ కళాక్షేత్రంలోకి ‘కుడా’ చొరబాటు
వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో వరంగల్ ఖ్యాతిని మరింత ఇనుమడించేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుగా మార్చేసింది.
- ఆఫీసు తరలింపుపై కవులు, కళాకారుల అసంతృప్తి.. కేసీఆర్ హయాంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం
- రూ.85.10 కోట్లతో భారీ భవనం
- ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- రాష్ట్రంలోనే అతి పెద్ద కళా కేంద్రం
- ప్రస్తుతం ఉన్న కుడా ఆఫీసుపై కాంగ్రెస్ నేతల కన్ను
- లీజు పేరిట 99 ఏండ్లకు దక్కించుకునేందుకు ఎమ్మెల్యే కుటుంబసభ్యుల ప్రయత్నాలు
వరంగల్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో వరంగల్ ఖ్యాతిని మరింత ఇనుమడించేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుగా మార్చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడి, తపించిన కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మించిన కళాక్షేత్రంలోకి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆఫీసును తరలించింది. కవులు, కళాకారులు, సాహిత్యకారుల వ్యతిరేకత మధ్య అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
కళారంగానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మరో భవనంలో ఉన్న కుడా ఆఫీసును కాళోజీ కళాక్షేత్రంలోకి మార్చడం సరికాదని కవులు, కళాకారులు, సాహిత్యకారులు చెప్తున్నారు. కాళోజీ కళాక్షేత్రంలోని రెండు, మూడో అంతస్తుల్లో కుడా ఆఫీసును ఏర్పాటు చేశారు. దీనిని కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న కుడా ఆఫీసు భవనాన్ని వాణిజ్యపరంగా అధికార పార్టీ నేతలకు అప్పగించేందుకే కాళోజీ కళాక్షేత్రంలోకి మార్చారనే ఆరోపణలొస్తున్నాయి. వరంగల్ నగరంలోని కుడా ప్రస్తుత ప్రధాన కార్యాలయం భవనాన్ని కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల కంపెనీకి లీజు పద్ధతిలో కట్టబెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.
30 వేల చదరపు అడగుల విస్తీర్ణంతో ఉన్న భవనంలో కుడా కార్యాలయం దాదాపు 20 ఏండ్లుగా కొనసాగుతున్నది. ఐదేండ్ల క్రితం రూ.5 కోట్లతో ఈ భవనాన్ని విస్తరించి, ఆధునీకరించారు. కుడా ప్రధాన కార్యాలయం విశాలంగా ఉండడంతో ఇదే భవనంలో సహకార శాఖ ట్రిబ్యునల్, సహకార శాఖ జిల్లా, డివిజనల్, భూగర్భ జలశాఖ కార్యాలయాలను కూడా కొనసాగిస్తున్నారు. కుడా కార్యాలయ చుట్టుపక్కల ప్రాంతమంతా ప్రైవేట్ దవాఖానలతో నిండిపోవడంతో ఇక్కడి భవనాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ప్రాంతంలో చదరపు అడుగు విస్తీర్ణానికి రూ.40 వరకు కిరాయి పలుకుతున్నది. అత్యాధునిక వసతులతో ఉన్న కుడా కార్యాలయం హాస్పిటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా ఉపయోగపడే విధంగా ఉన్నది. దీంతో తూతూ మంత్రంగా నోటిఫికేషన్ జారీ చేసి కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భాగస్వామిగా ఉన్న కంపెనీకి 99 ఏండ్ల లీజు ప్రాతిపదికన కుడా ప్రస్తుత ఆఫీసు భవనాన్ని లీజుకిచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిసింది.
కేసీఆర్ హయాంలో కళాక్షేత్రం
ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాలు 2014లో జరిగాయి. వరంగల్ నగరంలో ‘కాళోజీ కళాక్షేత్రం’ నిర్మించాలని, కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా పాటించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే నిర్ణయించారు. కాళోజీ నారాయణరావు శతజయంతిని పురస్కరించుకుని 2014 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి వరంగల్‌కు వచ్చి కాళోజీ కళాక్షేత్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఆ తర్వాత కరోనా కారణంగా దాదాపు మూడేండ్లు పనులు నెమ్మదిగా సాగాయి. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 2022లో సమీక్షించి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) నిధులతో పనులు పూర్తి చేసేలా ఆదేశించారు. రూ.85.10 కోట్లతో భవన నిర్మాణం పూర్తయ్యింది. కళాక్షేత్రం భవనంలో 1.39 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నివాస స్థలం ఉన్నది.
నాలుగు అంతస్థుల విశాల భవనంలో 1,500 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఆడిటోరియం నిర్మించారు. మినీ మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, వీఐపీ సూట్స్‌ను అత్యాధునికంగా నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రెండు మేకప్ రూములు, ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. గ్యాలరీని కూర్చుని చూడడానికి వీలుగా ఫ్రీపంక్షన్ లాబీని ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగు హై కెపాసిటీ లిఫ్ట్‌లను బిగించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కంటే వరంగల్ నగరంలోని కాళోజీ కళాక్షేత్రం విశాలంగా ఉన్నది. హనుమకొండ బస్టాండ్ సమీపంలో ప్రధానమైన సెంటర్లోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) గ్రౌండ్‌లోని 4.25 ఎకరాల్లో కళాక్షేత్రం నిర్మించారు. వరంగల్ నగరానికి సాంస్కృతిక శోభ, ప్రతిష్టను పెంచేలా కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని విభిన్నశైలిలో నిర్మించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024 నవంబరు 19న ప్రారంభించారు.
ఇతర కార్యాలయాలు వద్దు : అంపశయ్య నవీన్
కాళోజీ కళాక్షేత్రాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించవద్దని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ డిమాండ్ చేశారు. కాళోజీ ఫౌండేషన్‌కు రెండు గదులు, చిన్న సమావేశ మందిరాన్ని కేటాయించాలని కోరారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని చెప్పారు. కాళోజీ కళాక్షేత్రంలో కుడా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సరికాదని స్పష్టంచేశారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, ఉపాధ్యక్షుడు ఎస్ జీవన్‌కుమార్, కార్యదర్శి వీఆర్ విద్యార్థి, సంయుక్త కార్యదర్శులు పొట్లపల్లి శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఆగపాటి రాజ్‌కుమార్‌తో కలిసి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ప్రజా కవిని అవమానించడమే : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం ప్రజా కవిని అవమానించడమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం హనుమకొండలో నిర్మించిన కళాక్షేత్రంలోకి కుడా కార్యాలయాన్ని తరలించే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాహిత్య, సాంసృతిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా, కళాకారులు, సాహితీవేత్తలకు శాశ్వత వేదికగా ఉండాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కళాక్షేత్రాన్ని నిర్మించిందని గుర్తుచేశారు. సాహిత్య, సాంసృతిక కార్యక్రమాలతోపాటు గ్రంథాలయం, రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
కాళోజీ ఉపయోగించిన వస్తువుల భద్రత కోసం, కాళోజీ ఫౌండేషన్ కార్యకలాపాల కోసం సమావేశ మందిరాన్ని, రెండు గదులను కేటాయించాలని గత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కళాక్షేత్రం అసలు ఉద్దేశాన్ని పకనపెట్టి ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం తెలంగాణ సాహిత్య, సాంసృతిక రంగాలను అవమానించడమేనని విమర్శించారు. కళాక్షేత్రం ప్రారంభోత్సవ సమయంలో ముఖ్యమంత్రికి, కాళోజీ అవార్డు ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫౌండేషన్ సభ్యులు స్వయంగా విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

