– మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా
పాల్వంచ, మార్చి 17 : పాల్వంచ పట్టణంలోని నటరాజ్ సెంటర్లో ఉన్న ముస్లింల స్మశాన వాటికలో పందుల సంచారం పెరిగిపోవడంతో పాటు అక్కడే పందులను కాల్చడం, కోయడం, మాంసం విక్రయించడం జరుగుతుండటంపై మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్, మేయర్‌కు ఫిర్యాదు చేశారు. సుమారు 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్మశాన వాటికలో ముస్లింల పూర్వీకుల సమాధులు ఉన్నాయని, ప్రతి శుక్రవారం అలాగే రంజాన్, బక్రీద్ వంటి పవిత్ర పండుగల సమయంలో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.
అయితే కొంతమంది పందుల పెంపకదారులు తమ వ్యాపారానికి ఈ స్మశాన వాటికను అడ్డాగా మార్చుకోవడంతో ముస్లింల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయన్నారు. గతంలో అధికారులు స్మశాన వాటిక చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించినప్పటికీ, కొంతమంది దానిని తొలగించి పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 21న పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి పందుల పెంపకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్మశాన వాటికను రక్షించే చర్యలు చేపట్టి ముస్లింల మనోభావాలను కాపాడాలని జిల్లా కలెక్టర్, మేయర్‌ను ఆయన కోరారు.