Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ (DSP) బాధ్యతలు నిర్వహిస్తుండగా, తాజా సమాచారం ప్రకారం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం మ్యూజిక్ సెన్సేషన్ థమన్‌ను రంగంలోకి దించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కేవలం పాటలకు మాత్రమే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం పరిమితం కానుందని, సినిమాలోని మాస్ ఎలివేషన్లు మరియు కీలక సన్నివేశాలకు అవసరమైన రీ-రికార్డింగ్ బాధ్యతలను థమన్‌కు అప్పగించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలకు థమన్ తన నేపథ్య సంగీతంతో థియేటర్లను హోరెత్తించిన నేపథ్యంలో, ‘ఉస్తాద్’ కోసం కూడా హరీష్ శంకర్ అదే మ్యాజిక్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం.
అయితే, ఇటీవల జరిగిన Aura of Ustaad సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా పాల్గొని తన ఉత్సాహాన్ని చాటుకున్న తరుణంలో ఈ మార్పు వార్తలు రావడం గమనార్హం. మరోవైపు గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో మ్యూజిక్ విషయంలో జరుగుతున్న ఈ మార్పులపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.