Shama Mohamed : బీహార్ ఓటర్ల లిస్టు (Bihar voters list) లో బంగ్లాదేశీయులు (Bangladeshis), నేపాలీలు (Nepalies), మయన్మార్ జాతీయులు (Mayanmar nationals) ఓటర్లు (Voters) గా ఉన్నారని, ఎన్నికల సంఘం (Election commission) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) లో ఈ విషయం వెల్లడైందని ఈసీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నది నిజమే అయితే దీనిపై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరాలు వెల్లడించవచ్చగా అని కాంగ్రెస్ మహిళా నాయకురాలు శామా మహమెద్ ప్రశ్నించారు. దేశంలోని భారతీయుల పౌరసత్వాన్ని నిర్ణయించే హక్కు ఎన్నికల సంఘానికి లేదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ హక్కు కేంద్ర హోంశాఖకు మాత్రమే ఉంటుందని అన్నారు.
బీహార్ ఓటర్ల జాబితాలో విదేశీయులు ఓటర్లుగా ఉన్నది నిజమే అయితే.. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి 30 మంది గెలిచారని, ఆ గెలుపులన్నీ చెల్లనివేనా..? అని శామా మహమెద్ ప్రశ్నించారు. తాము నిజం తెలుసుకోవాలని భావిస్తున్నామని, ఈసీ క్లారిటీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా మరో రెండు నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఆ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను సవరిస్తోంది. అధికారులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ఓటర్ లిస్టులో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్తులు చాలామంది ఉన్నారని ఆదివారం ఈసీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై తాజాగా శామా మహమెద్ స్పందించారు.