Tejashwi Yadav : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సమయం సమీపించడంతో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష మహా కూటమి పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. తాజాగా ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై ఆర్జేడీ (RJD) కీలక నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) విమర్శలు గుప్పించారు.
బీహార్‌లో పరిస్థితులు భయంకరంగా మారుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని తేజస్వి ప్రశ్నించారు. మోదీ తన టెలీ ప్రాంప్టర్‌ను విడిచిపెట్టి మనుసులో మాట చెప్పాలని వ్యాఖ్యానించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ప్రధాని మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు.
బీహార్ పరిస్థితి గురించి ప్రధాని మోదీ ఏనాడైనా ఆందోళనగానీ, ఆవేదనగానీ వ్యక్తం చేశారా..? అని తేజస్వి ప్రశ్నించారు. కేవలం ప్రసంగాలు మాత్రమే చేశారని విమర్శించారు. బీహార్ ప్రజలతో ఓట్లు వేయించుకున్నప్పుడు వారికి భద్రత కల్పించడం ప్రధాని బాధ్యతా.. కాదా..? అని ఆయన నిలదీశారు. అదేవిధంగా బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రస్తుతం మతిస్థిమితం కోల్పోయి ఉన్నారని, ఆయన ఇప్పుడు బీహార్‌ను పాలించే పరిస్థితి లేదని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీయే రిమోట కంట్రోల్‌తో బీహార్‌ను ఆపరేట్ చేస్తున్నారని విమర్శించారు. బీహార్‌లో నేర చరిత్ర ఉన్నవాళ్లే చక్రవర్తులు అవుతున్నారని, వాళ్లు ఎన్నికల్లో గెలుస్తున్నారని అన్నారు.