DMK on Actor Vijay : తమిళనాడు (Tamil Nadu) లో అజిత్‌కుమార్ (Ajith Kumar) అనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు పోలీస్ కస్టడీ (Police custody) లో మరణించిన ఘటన ఆ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అధికార డీఎంకే (DMK) బాధ్యతారహిత్యంవల్లే కస్టోడియల్ డెత్స్ (Custodial deaths) జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది.
అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్‌ను నిరసిస్తూ ఆదివారం టీవీకే పార్టీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. టీవీకే శ్రేణులు భారీ సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విజయ్ అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు.
అజిత్‌కుమార్ కుటుంబానికి ముఖ్యమంత్రి స్టాలిన్ సారీ చెప్పడంపై స్పందించారు. సారీ చెబితే సరిపోదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీ పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలని ప్రశ్నించారు. విజయ్ వ్యాఖ్యలపై సోమవారం డీఎంకే స్పందించింది. ఆ పార్టీ అధకార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ మాట్లాడుతూ.. కస్టోడియల్ డెత్ కేసును సీబీఐకి అప్పగించామని చెప్పారు.
నటుడు విజయ్ ముందుగా బేసిక్ రాజకీయాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. కస్టోడియల్ డెత్‌లో పోలీసులు నిందితులుగా ఉన్నారని, ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారని తెలిపారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తే పోలీసులు వాళ్ల కేసును వాళ్లే దర్యాప్తు చేసుకున్నారని విమర్శిస్తారని, సీబీఐకి అప్పగిస్తే సీబీఐ దర్యాప్తు ఎందుకు అంటారని విమర్శించారు. కాబట్టి ఆయన బేసిక్ పాలిటిక్స్ తెలుసుకోవాలని అన్నారు.