హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన కమిటీలో చర్చించేందుకు ఎజెండా అంశాలను పంపించాలని రెండు తెలుగు రాష్ర్టాలను కేంద్ర జల్‌శక్తిశాఖ మరోసారి ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్, మెంబర్ సెక్రటరీ ఇటీవల లేఖ రాశారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జలవివాదాల పరిష్కారానికి 15 మంది అధికారులతో కేంద్రం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కమిటీ తొలిసారిగా గత జనవరి 30న ఢిల్లీలో భేటీ అయ్యింది. సమావేశానికి ఇరు రాష్ర్టాల అధికారులు, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, పలు కేంద్ర సంస్థల అధికారులు హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఎజెండా అంశాలను మాత్రం సమర్పించలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు వారం రోజుల్లోగా ఎజెండా అంశాలు సమర్పించాలని, వాటిలో ఏకాభిప్రాయం కుదిరిన, సమ్మతించిన అంశాలతో ఎజెండాను ఖరారు చేస్తామని సీడబ్ల్యూసీ ప్రతిపాదించింది. 15 రోజుల తర్వాత మరోసారి కమిటీ సమావేశం ఏర్పాటుచేస్తామని వెల్లడించింది. ఇప్పటికీ రెండు రాష్ర్టాలు ఎజెండా అంశాలను కేంద్రానికి నివేదించలేదు. దీంతో కేంద్ర జల్‌శక్తిశాఖ మరోసారి రెండు రాష్ర్టాలకు లేఖ రాసింది.
ఇదిలా ఉండగా, తెలంగాణ ఇంజినీర్లు ఇప్పటికే ఎజెండా సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. మొత్తం 12అంశాలను చర్చించాలని నిర్ణయించింది. ఏపీ చేపట్టిన పోలవరం-బనకచర్ల(నల్లమలసాగర్) ప్రాజెక్టుకు అనుమతిస్తే.. తమకు సైతం గోదావరి వరద జలాల నుంచి 200 టీఎంసీలను మళ్లించుకునేందుకు అనుమతివ్వాలనే డిమాండ్‌ను ముందుకు తీసుకొచ్చినట్టు సమాచారం. కృష్ణా బేసిన్‌కు సంబంధించి ఆది నుంచి గతంలోని డిమాండ్లనే ముందు పెట్టినట్టు తెలుస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వాలని కోరినట్టు సమాచారం. అసలు చర్చలకు వెళ్లడమే తప్పని నిపుణులు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.