సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరలో ప్రధాన ఘట్టమైన రంగం (Rangam) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత (Matangi Swarnalatha) భవిష్యవాణి (Bhavishyavani) వినిపించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారని, కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాని చెప్పారు. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారని, తాను అడ్డురానని పేర్కొన్నారు.
‘బోనాల జాతరకు సంతోషంగా సాకలు పోసి బాగా చేశారు. ప్రతీసారి చేసినట్టే ఈ సారి కూడా పొరపాటు చేశారు. ప్రతి సంవత్సరం చెబుతునా.. నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను. నా పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి. వేల రాసులు నేను రప్పించుకుంటున్న. నాకు రక్తం బలి ఇవ్వడం లేదు. మీరు మాత్రం ఆరగిస్తారు. నాకు మాత్రం ఇవ్వడం లేదు.. నాకు సరిగ్గా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారు.
నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు.. అందుకే మరణాలు పెరుగుతున్నాయి. నేను అస్సలు ఆ విషయంలో అడ్డుపడను. నాకు రక్తం బలి కావాలి. నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడు తోడుగా నిలబడుతాను. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది. ప్రజలు జాగ్రత్త ఉండాలి. అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి. ఐదు వారాలు పాటు నాకు పూజలు, సాక పోసి ఆనంద పరచాలి. నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం జరుగుతుంది. నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు.’ అని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.