సంస్థాన్‌నారాయణపురం, మార్చి 5: కరెంటు కోతలపై రైతులు కన్నెర్రజేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ఎదుటే ఎండిపోతుండటంతో ఆగ్రహించిన రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం సబ్‌స్టేషన్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. సమయపాలన లేకుండా కరెంటు కోతలు విధిస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని కొర్రతండాకు చెందిన రైతులు విద్యుత్తు అధికారులపై మండిపడ్డారు.
పంటలు పొట్ట దశకు వచ్చాయని, కరెంటు సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయనికి 14 గంటలపాటు కరెంటు అందిస్తున్నామని రికార్డులో చూపుతున్నారు తప్ప… సరిగ్గా 9 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటలపాటు విద్యుత్తు అందిస్తామని మోసం చేసిందని ధ్వజమెత్తారు. వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.