TGSRTC | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్నది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అక్కడి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే.. మన ప్రభుత్వం మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నది. తెలంగాణలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేది లేదంటూ కరాఖండిగా చెప్పేసింది. ఏపీ ప్రభుత్వం ఈ నెల 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. 40 శాతం అంతకంటే ఎకువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నది. వైకల్యశాతం ఎక్కువగా ఉన్న దివ్యాంగులకు సహాయకుడి(ఎసార్ట్)తో వెళ్లేందుకు అనుమతి ఉంటే.. ఆ సహాయకుడికి ఐదు రకాల బస్సుల్లో సగం చార్జి మాత్రమే తీసుకోనున్నారు.
తెలంగాణలో దివ్యాంగులైన పురుషులకు మహిళలతో సమానంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారంటూ ఇటీవల ఓ ఫేక్ జీవో సోషల్ మీడియాలో ప్రచారమైంది. అయితే, దీనిపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే పత్రికా ప్రకటన ద్వారా, అధికారిక టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించిందని, తెలంగాణ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని దివ్యాంగుల సంఘాలు మండిపడుతున్నాయి. తమకు కూడా తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. దివ్యాంగులకు సహయంగా వచ్చే వారికి కూడా 50 శాతం రాయితీ ప్రకటించాలని కోరుతున్నాయి. లేకపోతే అన్ని దివ్యాంగ సంఘాలు కలిసి ప్రభుత్వంపై నిరసనలు తెలిపేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాయి.