ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జెన్ జీల ఉద్యమ విజయం దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఆలోచనలో పడేసింది. జెన్ జీని తేలిగ్గా తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ‘జెన్ జీలు మురికిగుంటలో ఉండే తరం’ అంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన నోటిదురుసుతనాన్ని ప్రదర్శించినా, జెన్ జీలో ఇద్దరు, ముగ్గురిని ఉరితీయాలని కొందరు బీజేపీ నాయకులు తమ వాచలత్వాన్ని ప్రదర్శించినా ఏ రాజకీయ పక్షం కూడా జెన్ జీని దూరం చేసుకునే సాహసం చేయలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని 1994-95 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ బేస్ ఓటు బ్యాంకు అలాగే ఉన్నది. తటస్థులు, కొత్త ఓటర్లు ఫలితాలను నిర్ణయిస్తారు. ఇప్పుడు జెన్ జీ ఈ పాత్ర పోషిస్తుంది. అందరు పాలకులు తమను తాము సంస్కరించుకోవాల్సిన అవసరం జెన్ జీ కల్పించింది.
13 ఏండ్ల పాలనలో ప్రధాని మోడీ తొలిసారి ఒక మంత్రితో రాజీనామా చేయించినా, అర్ధరాత్రి 12 గంటలకు తొలిసారి మోదీ ‘ఫ్రెండ్స్’ అంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో మాట్లాడారు. ఒకవైపు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ మహాత్మాగాంధీని దేశద్రోహి అని ప్రచారం చేస్తున్నది. మరోవైపు ప్రధాని గాంధీజీకి నివాళులు అర్పిస్తారు. బీజేపీ విభాగాలు జెన్ జీని బూతులు తిడుతుంటాయి.
జంతర్ మంతర్‌లో జెన్ జీ విజయం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియాతో పిచ్చాపాటి మాట్లాడారు. జెన్ జీని ఆకట్టుకోవడం గురించి గంటల తరబడి చర్చించారు. ఏ ఇంగ్లిష్ జర్నలిస్ట్ తెలుగులో ఇచ్చిన సలహానో కానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసును 25 ఏండ్ల నుంచి 21కి కుదించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. తీర్మానం చేస్తే ఏమవుతుందో? తెలంగాణ అసెంబ్లీ తీర్మానం మీద మన దేశం నడుస్తుందా? 25 నుంచి 21కి మార్చడం సరే, ఇప్పటివరకు ఉన్న 25 ఏండ్ల వారిలో ఎంతమందికి టికెట్లు ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడి వయసు ఎంత? అనే ప్రశ్నలు రావా? పోటీ చేసే వయసు 21 ఏండ్లకు తగ్గించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆ రోజు మీడియాలో ప్రచారం లభిస్తుంది తప్ప అంతకుమించి ఏమవుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనపడింది యువశక్తితోనే. 1988లో రాజీవ్ గాంధీ హయాంలో ఓటుహక్కును 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించారు. 1989లో ఎన్నికలు జరిగాయి. అప్పటినుంచి కాంగ్రెస్‌కు ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. 1984లో ఈ పార్టీకి 48 శాతం ఓట్లు వస్తే 18 ఏండ్లకు ఓటుహక్కు అమల్లోకి వచ్చిన 1989లో 39.5 శాతం, 1991లో 36%, 1996లో 28.8%, 1999లో 28.3%, 2004 లో 26.5%, 2009లో 28.6%, 2014లో 19.5%, 2019లో 19.5%, 2024లో 21.2 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ బలహీనపడడానికి అనేక కారణాలు ఉండవచ్చు. యువత ఆ పార్టీకి దూరం కావడం ప్రధాన కారణం.
తెలంగాణలో 3.35 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 18 నుంచి 29 ఏండ్ల వరకు ఉన్న జెన్ జీ ఓటర్లు 24.26 శాతం మంది ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.4 శాతం ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 37.35 శాతం వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య తేడా రెండు శాతమే. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్‌కు కేవలం 4.82 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. రాష్ట్రంలో 18-19 ఏండ్ల వయసు ఓటర్లే 5.45 లక్షల మంది ఉన్నారు. ఏ పార్టీ ఓటుబ్యాంకు ఆ పార్టీకే ఉన్నా 18 నుంచి 29 ఏండ్ల వయసులో ఉన్న జెన్ జీ ఓటర్లు 24. 26 శాతం మంది ‘అధికారమనే అహంకారానికి’ చరమగీతం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారికి ఉద్యోగాలు లేవు, ఆశావహ పరిస్థితులు లేవు, ప్రోత్సాహాన్ని అందించే వాతావరణమూ లేదు.
‘ఎంత గొప్ప నృత్య దర్శకుడైనా సినీహీరో కృష్ణతో డ్యాన్స్ చేయించలేరు’ అని పాతరోజుల్లో ఓ జోక్ ఉండేది. ఇంగ్లిష్ మీడియా సలహా ఇవ్వగలదు. కానీ జెన్ జీని ఆకట్టుకునే లక్షణాలు మన సీఎంలో ఉండాలి కదా? రాహుల్ గాంధీ ప్రధాని కాగానే జెన్ జీని విద్యాశాఖ మంత్రిని చేయడం తన బాధ్యత అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా విద్యాశాఖ మంత్రిని నియమించే తీరిక లేదు, విద్యార్థుల సమస్యలు పట్టించుకునే ఓపికా లేదు, హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఊసేలేదు. కానీ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి నియామకం బాధ్యత తీసుకున్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించమంటే పక్క రాష్ట్రంలో చెల్లించడం లేదని వాదన. తెలంగాణ ఏమైనా పక్క రాష్ర్టానికి అనుబంధ రాష్ట్రమా? వెంటనే జెన్ జీ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనే ఆత్రం తప్ప వారి సమస్యలపై ఏ మాత్రం ఆసక్తి లేదు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే జెన్ జీలో కలిసిపోయారు. ఐటీ మంత్రిగా నవతరానికి దగ్గరయ్యారు. బడా ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకురావడమే కాదు టీ హబ్ ఏర్పాటు ద్వారా యువతకు చేరువయ్యారు. చివరకు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా అంతర్జాతీయ సదస్సులకు పిలిస్తే వెళ్లి యువతను ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు.
ఒక రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ రాష్ట్ర ప్రతిష్ఠ పెంచేలా మాట్లాడాలనే అవగాహనతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. కానీ రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే.. పాఠశాలల పిల్లల సమావేశంలో కూడా ఏవో బూతులు, ప్రత్యర్థి పార్టీల నేతల చావును కోరుకోవడం, వారి రక్తం పొలాలకు పారించాలని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకుడు జెన్ జీకి ఎలా చేరువవుతారు. తన నోటి ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో యువతకు దూరమైంది. సంప్రదాయంగా కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్నవారే ఆ పార్టీకి దూరమవుతుంటే ఇక నవతరం ఎందుకు చేరువవుతుంది.
గతంలో జెన్ జీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీపై ఆసక్తి చూపేవారు. కానీ మతం పేరుతో విభజన తప్ప.. హామీ ఇచ్చినట్టు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు లేవు, ఏ వర్గానికీ సంతృప్తి లేదు. యువతలో ఏ మేరకు అసంతృప్తి ఉందో జంతర్ మంతర్ ఘటన దేశానికి చాటిచెప్పింది. ఒకప్పుడు ఊరిలో మోతుబరి ఎవరికి ఓటు వేయమంటే వారికి వేసేవారు. ఆ తర్వాత కాలంలో భర్త చెప్పినట్టు భార్య ఓటు వేసేది. ఇప్పుడు జెన్ జీ సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే తరం. రాజకీయ వ్యాపారులకు కంటికి మీద కునుకు లేకుండా చేస్తున్న తరం జెన్ జీ.
– బుద్దా మురళి