చండీగఢ్: కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంక్ కూలింది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలు మరణించారు. వారి తల్లులు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆ ఇద్దరు మహిళలను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. (Water Tank Collapses) దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 83లోని జీ-21 సొసైటీ సమీపంలో ఉన్న గుడిసెల ప్రాంతంలో ఇటీవల ఒక సిమెంట్ వాటర్ ట్యాంక్‌ను నిర్మించారు. సెప్టెంబర్ 25న ట్యాంక్ నిర్మాణం పూర్తికావడంతో దానిని నీటితో నింపారు. ఆ ట్యాంక్‌లోని నీటిని వినియోగించుకోవచ్చని స్థానికులకు అధికారులు తెలిపారు.
కాగా, ఆదివారం స్థానికంగా అద్దె ఇంట్లో నివసించే రుబీనా తన నాలుగేళ్ల కుమార్తెకు స్నానం చేయించడానికి ఆ వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లింది. అలాగే తన చిన్న కుమారుడికి స్నానం చేయించడానికి మరో మహిళ కూడా అక్కడకు చేరుకున్నది. అయితే అకస్మాత్తుగా వాటర్ ట్యాంక్ కూలింది. అక్కడున్న పిల్లలు, మహిళలపై శిథిలాలు పడ్డాయి.
మరోవైపు గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఇద్దరు పిల్లలు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గాయపడిన వారి తల్లులకు చికిత్స అందించారు.
కాగా, పోస్ట్‌మార్టం అనంతరం పిల్లల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడైన కాంట్రాక్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అతడ్ని త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ పోలీస్ అధికారి వివరించారు.