Stampede : ఐపీఎల్-2025 (IPL-2025) కప్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ విజయోత్సవాలు (Celebrations) విషాదాంతమయ్యాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్దకు అభిమానులు బారీగా తరలిరావడంతో తొక్కిసలాట (Stampede) జరిగి 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 37 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి ఐసీయూ (ICU) లో చికిత్స అందిస్తున్నారు.
ఏకంగా 18 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ కప్పు గెలిచింది. ఇవాళ ఆ జట్టు అహ్మదాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకుంది. నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో సంబురాలకు ఏర్పాట్లు చేశారు. ఈ సంబురాల్లో పాల్గొనేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొందరు బారీకేడ్లను, పోలీసులను తోసుకుని స్టేడియం వైపు దూసుకెళ్లారు.
దాంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ క్రమంలో అభిమానులు గుంపులు గుంపులుగా స్టేడియంలోకి పరుగులు తీశారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 37 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.