Kamal Haasan | నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasa) వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తమిళం నుంచి కన్నడ భాష (Kannada language) పుట్టిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కన్నడ భాషపై చెలరేగిన వివాదం వేళ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇవాళ రాజ్యసభ స్థానానికి నామినేషన్ (Rajya Sabha nomination) దాఖలు చేయాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. తన రాబోయే చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life) విడుదలయ్యే వరకూ నామినేషన్ దాఖలును వాయిదా వేయాలని సన్నిహితులు కమల్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వారి సూచనల మేరకు ఇవాళ వేయాల్సిన నామినేషన్‌ను వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి.
కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పూర్తి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు డీఎంకే తరపున ఆయన తమిళనాడులో ప్రచారం కూడా చేశారు. దాంతో ఆయన రాజ్యసభలో అడుగుపెట్టేందుకు డీఎంకే పూర్తి సహకారం అందించనుంది. జూన్ 19న జరిగే రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో ఆయనను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఎంఎన్ఎం గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంఎన్ఎం కమల్ హాసన్ పేరును ప్రతిపాదించగానే రాజ్యసభ సీటును ఆయనకు కేటాయిస్తున్నట్టు మిత్రపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. 2024లో ఎంఎన్ఎం పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరించి స్టాలిన్ ఈ కేటాయింపు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రస్తుతం ఎంఎన్ఎం పార్టీకి శాసనసభ, పార్లమెంట్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.
వివాదం ఏంటంటే..?
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గత వారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఇదే కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉయిరే, ఉరవే తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ అనంతరం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు.
‘శివరాజ్‌కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. ‘కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా?’ అని ధ్వజమెత్తారు. కన్నడ ప్రజలకు కమల్ క్షమాపణలు చెప్పాలడి డిమాండ్ చేశారు.
తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను.. కమల్ హాసన్
మరోవైపు తాజా వివాదంపై క్షమాపణ చెప్పడానికి కమల్‌హాసన్ నిరాకరించారు. తప్పు చేస్తేనే తాను క్షమాపణలు చెబుతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘గతంలో కూడా నా మీద ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయి. తప్పుచేయని పక్షంలో నేను అస్సలు క్షమాపణలు చెప్పను. ఇది నా జీవన విధానం. నేను ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, చట్టాన్ని నమ్ముతాను. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దు’ అని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘థగ్‌లైఫ్’ జూన్ 5న విడుదలకానుంది.
Also Read..
“Kamal Haasan | సత్యం ఎన్నటికీ తల వంచదు.. కన్నడ భాషపై వివాదం వేళ కమల్ హాసన్‌కు మద్దతుగా పోస్టర్లు”