Kamal Haasan | కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలను కమల్ మరోసారి సమర్థించుకున్నారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో థగ్‌లైఫ్ సినిమా ప్రదర్శనను నిషేధించడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కమల్ వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని సూచించింది. అయితే, కమల్ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. సినిమా ప్రదర్శనను కర్నాటకలో నిలిపివేయడానికి అంగీకరించారు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొంటూ క్షమాపణలు చెప్పనంటూ హైకోర్టుకు తెలిపారు. తాను క్షమాపణలు చెప్పేంత తప్పు చేయలేదన్నారు.
ఫిల్మ్ చాంబర్‌తో చర్చలు జరిపేందుకు ప్రతిపాదించారు. థగ్‌లైఫ్ మూవీ జూన్ 5న విడుదల కానున్నది. థగ్‌లైఫ్ ఆడియో విడుదల సందర్భంగా కమల్ హసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో థగ్‌లైఫ్ మూవీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిషేధించింది. ఈ క్రమంలో విశ్వనటుడు కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని హైకోర్టు సూచించింది. నటుడి తరఫున సీనియర్ న్యాయవాది చిన్నప్ప వాదనలు వినిపించారు. అయితే, వ్యాఖ్యలపై కమల్ సమాధానాన్ని కోర్టుకు సమర్పించగా.. పరిశీలించిన కోర్టు క్షమాపణలు లేవని వ్యాఖ్యానించింది.
Read Also : Kamal Haasan | సత్యం ఎన్నటికీ తల వంచదు.. కన్నడ భాషపై వివాదం వేళ కమల్ హాసన్‌కు మద్దతుగా పోస్టర్లు
ఈ సందర్భంగా కోర్టు ‘మీరు కమల్ హసన్.. ఇంకా ఎవరైనా కావొచ్చు. మీరు ప్రజల మనోభావాలను దెబ్బతీయలేరు. ఈ దేశ విభజన భాషాపరంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి అలాంటి ప్రకటనలు చేయకూడదు. కర్నాటక ప్రజలు క్షమాపణ మాత్రమే అడిగారు. ఇప్పుడు మీరు రక్షణ కోరుతూ ఇక్కడికి వచ్చారు. మీరేం చరిత్రకారులు లేదంటే భాషావేత్త కాదు. అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు మీకేం నైపుణ్యం లేదు. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు..? కన్నడ ప్రజలు మిమ్మల్ని ఏమి అడిగారు..? కేవలం క్షమాపణలే కదా. ఈ వ్యవహారంలో క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది’ అంటూ న్యాయమూర్తి నాగప్రసన్న వ్యాఖ్యానించారు.