Kamal Haasan | తమిళం నుంచి కన్నడ భాష (Kannada language) పుట్టిందంటూ కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ వివాదం నేపథ్యంలో కమల్ హాసన్ తాజా చిత్రం ‘థగ్‌లైఫ్’ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ చెన్నైలో కమల్ హాసన్‌కు అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి (Kamal Haasan posters in Chennai).
ఇటీవలే చెన్నైలో జరిగిన థగ్‌లైఫ్ సినిమా ఆడియో లాంఛ్‌లో ‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యం చెన్నైలోని ప్రముఖ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లను అంటించింది. ఆ పోస్టర్లలో ‘రెండు భాషల మధ్య సంబంధం ఏంటో ఆయన స్పష్టంగా చెప్పారు’, ‘ప్రేమ ఎప్పటికీ క్షమాపణలు చెప్పదు’, ‘సత్యం ఎన్నటికీ తల వంచదు’ అని రాసి ఉంది. కమల్ వ్యాఖ్యల తర్వాత కన్నడ అనుకూల సంఘాలు కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు తెలిపిన నేపథ్యంలో తమిళనాడు చెన్నైలో ఆయన పార్టీ ఇలా పోస్టర్లను అంటించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఇదే కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉయిరే, ఉరవే తమిళే (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కమల్ హాసన్ అనంతరం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు.
‘శివరాజ్‌కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్నా నా కుటుంబ సభ్యుడు. అందుకే ఆయన ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అందుకే నా ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళ నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. బెంగళూరులో థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను కొందరు ఆందోళనకారులు చించివేశారు. ‘కర్ణాటకలో మీకు వ్యాపారం కావాలి.. కానీ కన్నడ భాషను అవమానిస్తారా?’ అని ధ్వజమెత్తారు.
తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను.. కమల్ హాసన్
మరోవైపు తాజా వివాదంపై క్షమాపణ చెప్పడానికి కమల్‌హాసన్ నిరాకరించారు. తప్పు చేస్తేనే తాను క్షమాపణలు చెబుతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘గతంలో కూడా నా మీద ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయి. తప్పుచేయని పక్షంలో నేను అస్సలు క్షమాపణలు చెప్పను. ఇది నా జీవన విధానం. నేను ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, చట్టాన్ని నమ్ముతాను. ఈ విషయంలో ప్రజలు జోక్యం చేసుకోవద్దు’ అని కమల్‌హాసన్ స్పష్టం చేశారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘థగ్‌లైఫ్’ జూన్ 5న విడుదలకానుంది.
‘థగ్‌లైఫ్’పై కర్ణాటకలో నిషేధం
కర్ణాటక రక్షణ వేదికతో పాటు పలు ప్రజా సంఘాలు కమల్ హాసన్ వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి. ఈ నెల 30లోగా కమల్‌హాసన్ క్షమాపణలు చెప్పకపోతే ‘థగ్‌లైఫ్’ను బహిష్కరిస్తామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) అల్టిమేటం జారీచేసింది. అందుకు అనుగుణంగానే మే 30న కేఎఫ్సీసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. తాము విధించిన డెడ్‌లైన్ ముగిసినా కమల్‌హాసన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ‘థగ్‌లైఫ్’ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్
ఈ వివాదం నేపథ్యంలో కమల్ హాసన్ తాజా చిత్రం ‘థగ్‌లైఫ్’ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయంపై కమల్ హాసన్ తాజాగా కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)ను ఆశ్రయించారు. తన రాబోయే చిత్రం థగ్ లైఫ్‌ను రాష్ట్రంలో విడుదల చేసి ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలను ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
Also Read..
“Kamal Haasan | కన్నడ భాషపై వివాదం.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్”
“తమిళనాడులో తగ్గనున్న టికెట్ రేట్లు”