హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టుకున్న వెల్ఫేర్ (సంక్షేమ) కమిట్మెంట్స్ బరువయ్యాయని చెప్పారు. ఈ సమయంలో పోలీసులకు నిధులివ్వాలంటే సద్వినియోగం చేసుకుంటారన్న నమ్మకం, విశ్వాసం కలుగాలని పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పోలీసుశాఖకు నిధులు ఇచ్చేందుకు నమ్మకం కలిగించాలంటూనే ‘ల్యావిష్‌గా స్పెండ్ చేసేంత లగ్జరీ మన దగ్గర లేదు’ అని చెప్పారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026’కు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి పోలీసుశాఖను ఉద్దేశించి మాట్లాడారు. తాను సీఎంగా ఉన్న ఈ రెండున్నరేండ్లలో ఫలానా పోస్టులు కావాలని పైరవీలు చేసిన వారెవరూ లేరని, పోస్టింగ్‌ల విషయం డీజీపీ శివధర్‌రెడ్డికి, తనకు మాత్రమే తెలుసునని చెప్పారు.
పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు కూడా ఆ విషయం తెలియదని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారుల విషయంలో మూడు క్యాటగిరీలతో జాబితాను సిద్ధం చేసుకున్నానని, ఆ అధికారి పేరు చెప్తే వారు ఏ క్యాటగిరీనో ఆటోమేటిక్‌గా తెలిసిపోతుందని, వారికి ఎస్పీ కేడర్ ఇవ్వాలా? ఆఫీస్ మేనేజ్మెంట్ ఇవ్వాలా? లేదంటే ఖాళీగా ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలనే లిస్ట్ చేసి పెట్టుకున్నట్టు చెప్పారు. పోలీసుశాఖ బడ్జెట్ విషయంపై మాట్లాడుతూ ‘భోజనాలు అయిపోయినయ్.. వాళ్ల దాంట్లో, వీళ్ల దాంట్లో కొంచెం తగ్గించి వడ్డించేందుకు ప్రయత్నిస్తా’ అని చెప్పారు. డిసెంబర్లోనే రిట్రీట్ చేసుకుంటే కొంత సమయం దొరుకుతుందని, కొంత నిధులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
పోలీసు శాఖ అప్‌గ్రేడ్ అవ్వాలి
రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో పోలీసుశాఖ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాలని కోరారు. లేకపోతే పోలీసులు నేరాలను నిరోధించలేరని చెప్పారు. ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్, ముంబై, చెన్నై వరదల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్, నారోటిక్స్, రిక్రూట్మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిషారానికి కొన్ని ప్రతిపాదనలు అందించారని, వాటిని విశ్లేషించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీసుల పనితీరు ఆధారంగానే పోస్టింగులు ఉంటాయని తేల్చిచెప్పారు. ఏటా డిసెంబర్లో రిట్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించుకోవచ్చని తెలిపారు.
గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా తగ్గింది : సీఎం
తనకు క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారం విషయంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ రియాలిటీ ఒక స్టేజ్‌కు వచ్చాక తగ్గిపోతుందని చెప్పారు. తాను జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఒక ఫీడ్‌బ్యాక్, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరోరకమైన ఫీడ్‌బ్యాక్ ఉన్నదని, తాను ఎమ్మెల్యే అయినప్పుడు ఎక్కువ ఫీడ్ బ్యాక్ ఉన్నదని, ప్రతిగ్రామంలో జనాలను తాను కలిసేవాడినని తద్వారా ఎక్కువ సమాచారం వచ్చేదని తెలిపారు. ఎంపీ అయ్యాక సమాచారం రావడం తగ్గిపోయిందని, ముఖ్యమంత్రి అయ్యాక అది పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు.