హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ)/దుండిగల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట సర్కిల్ పరిధి బాచుపల్లిలోని ప్రణీత్ అంటీలియా గేటెడ్ కమ్యూనిటీలో సోమవారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. గేటేడ్ కమ్యూనిటీ వాసులు మూసివేసిన 40 అడుగుల రహదారిని కోర్టు ఆర్డర్ మేరకు తొలగిస్తున్నామంటూ, హైడ్రా అధికారులు ప్రహరీతోపాటు పలుషెడ్లను నేలమట్టం చేశారు. దీంతో తమ భద్రతకు హైడ్రా చేపట్టిన చర్యలు గొడ్డలిపెట్టుగా మారాయని స్థానికులు, మహిళలు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ, భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రణీత్ అంటీలియా గేటెడ్ కమ్యూనిటీకి చెందిన ప్రహరీని జేసీబీలతో హైడ్రా అధికారులు కూల్చివేశారు. గత ఏడాది కూడా ఇదే తరహాలో ఇక్కడ చేపట్టిన కూల్చివేతలు వివాదాస్పదమైన విషయం విదితమే.
తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా చేపట్టిన ఈ చర్యపై నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కమ్యూనిటీని గేటెడ్ కమ్యూనిటీగా గుర్తించి మున్సిపల్ అధికారులు భారీగా పన్నులు వసూలు చేస్తున్నారని, కానీ ఇప్పుడు రక్షణగా ఉన్న గోడను కూల్చివేయడం అన్యాయమని మహిళలు మండిపడ్డారు. కనీస సమాచారం ఇవ్వకుండా నివాసితులతో చర్చించకుండా నేరుగా కూల్చివేతలు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాలనీవాసులు పేర్కొన్నారు. ఎవరో చెప్పిన మాటలు వింటున్న హైడ్రా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరుపకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గేటెడ్ కమ్యూనిటీ అని నమ్మి ఇక్కడ ఇండ్లు కొనుగోలు చేశామని, హైడ్రా చేపట్టిన పనులతో తమ కుటుంబాల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికే కూల్చివేత
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, ఎగ్జిట్-4 వరకు రహదారి సౌకర్యం కల్పించే ఉద్దేశంతోనే ప్రణీత్ అంటీలియాలోని ప్రహరీని కూల్చివేశామని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ప్రణీత్ అంటీలియా గేటేడ్ కమ్యూనిటీ కాదని నిర్ధారించుకున్నాకే కూల్చివేతలు చేపట్టామని చెప్తున్నారు. అయితే, కమ్యూనిటీ ప్రైవేసీని దెబ్బతీస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనతో కాలనీలో ఆందోళన నెలకొన్నదని, ఉన్నతాధికారులు స్పందించి స్థానికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అక్కడి నివాసితులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం ప్రణీత్ అంటీలియా గేటేడ్ కమ్యూనిటీ ప్రహరీ, షెడ్లను కూల్చివేసిన అధికారులు రాత్రి పొద్దుపోయేంత వరకు బీటీరోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు ఏర్పాటుతో మల్లంపేట పరిసర కాలనీల నుంచి ప్రగతినగర్, నిజాంపేట వెళ్లే వారికి సుమారు 5 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు.
హైడ్రా ఎవరికోసం పనిచేస్తున్నది?
ప్రణీత్ అంటీలియా గేటెడ్ కమ్యూనిటీలో 600 కుటుంబాలు నివాసముంటున్నాయి. కమ్యూనిటీ చుట్టూ ఉన్న ప్రహరీని హైడ్రా అధికారులు ఏకపక్షంగా కూల్చివేశారు. అసలు జనమే లేనిచోటుకు రోడ్డును ఎందుకు నిర్మిస్తున్నారో అర్థం కావడం లేదు. ఉదయం నుంచి మా కాలనీలో కరెంట్‌ను నిలిపివేయడంతో అంధకారమైంది. ఎవరికైనా ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? పెద్దల బిల్డింగ్‌లను వదిలి మా లాంటి చిన్నవాళ్లపై ప్రతాపం చూపుతున్నారు. అసలు హైడ్రా ఎవరి కోసం పనిచేస్తున్నది? ప్రజల కోసమా? రియల్ఎస్టేట్ వ్యాపారుల కోసమా? ఆలోచించండి.
-విజ్ఞాన్‌రెడ్డి, కాలనీవాసి
కోర్టు స్టే ఉన్నా బేఖాతరు
గత ఏడాది జూన్ 24న ఇలాంటి ప్రయత్నమే జరిగింది. అప్పట్లో కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. అయినప్పటికీ, అధికారులు మొండిగా వ్యవహరించడం అప్రజాస్వామికం. పక్కనే ఉన్న మల్లంపేట లేఅవుట్, ఇతర ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసమే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు. రోడ్డు విస్తరణ పేరుతో మా ప్రైవేట్ ప్రాంగణాల్లోకి చొరబడటం సరైంది కాదు. మాది గేటెడ్ కమ్యూనిటో, కాదో ప్రభుత్వం తక్షణమే స్పష్టం చేయాలి. -నాగేశ్వర్రావు, కాలనీవాసి