ఢిల్లీ: ఒకటా.. రెండా..? చేతికందినట్టే అంది చేజారిన ఐసీసీ ట్రోఫీలు లెక్కలేనన్ని! ఆ టోర్నీలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలైతే అంతకుమించి! దిగ్గజ సారథులు, ఎందరో ప్రతిభావంతమైన క్రికెటర్లు జట్టులోకి వస్తూ పోతున్నా భారత అభిమానుల 13 ఏండ్ల కల నెరవేరింది మాత్రం బార్బడోస్ (వెస్టిండీస్) లోనే! దశాబ్దంన్నరగా భారత జట్టుకు పట్టిన ఐసీసీ ట్రోఫీల శాపానికి విముక్తి కల్పించిన నేల అది.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2024 టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు ఆ గడ్డపైనే గెలిచి తమ ఖాతాలో రెండో పొట్టి కప్పును దక్కించుకుంది. అక్కడ్నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్లో మరీ ముఖ్యంగా టీ20ల్లో అయితే టీమ్ఇండియా ఆధిపత్యం కొత్త ఎత్తులకు చేరింది. స్టార్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆటకు వీడ్కోలు పలికినా యువ, సీనియర్ ఆటగాళ్ల మేళవింపుతో కూడిన మెన్ ఇన్ బ్లూ.. ప్రపంచ క్రికెట్లో భారత ఆధిపత్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది. తాజాగా అహ్మదాబాద్ విజయం దానికి కొనసాగింపు మాత్రమే. పిక్చర్ అబీ బాకీ హై!
ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. 1970-80 దశకాల్లో ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించింది. ఆ తర్వాత స్థానం ఆస్ట్రేలియాది. స్టీవ్ వా మొదలుకుని రికీ పాంటింగ్, క్లార్క్ నుంచి ఇప్పుడు పాట్ కమిన్స్ వరకూ ఆ జట్టు తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంటూనే ఉన్నది. ముఖ్యంగా 2000వ దశకంలో కంగారూలతో మ్యాచ్‌కు ముందే ప్రత్యర్థి జట్లు ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి ఉండేది. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లలో ఓటమెరుగని ఆ జట్టు ఆట మరో మెట్టు ఎక్కింది. తాజాగా భారత జట్టునూ క్రికెట్ విశ్లేషకులు నాటి విండీస్, ఆస్ట్రేలియాతో పోలుస్తున్నారు.
దానికి కారణాలు లేకపోలేదు. 2024 తర్వాత పొట్టి ఫార్మాట్లో భారత్ 8 టీ20 సిరీస్‌లు ఆడితే అందులో ఒక్కదాన్లోనూ ఓడిపోలేదు. అయినా అవేమో అల్లాటప్పా జట్లు కూడా కాదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ను వారి సొంత మైదానాల్లో చిత్తుచేసిన ఘనత సూర్య సేన సొంతం. 2023 అక్టోబర్ నుంచి మార్చి దాకా భారత జట్టు 56 మ్యాచ్‌లు ఆడితే అందులో మనం ఓడినవి 8 మాత్రమే అంటే టీమ్ఇండియా ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2023 నుంచి టీ20ల్లో భారత్ ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌లోనూ ఓడిపోలేదు.
భారత జట్టుకు దూకుడు కొత్తేమీ కాదు. దిగ్గజ సారథి గంగూలీ భారత జట్టుకు దూకుడును పరిచయం చేస్తే ధోనీ, కోహ్లీ దానిని మరింత ముందుకు తీసుకెళ్లారు. రోహిత్ సారథ్యంలోనూ భారత జట్టు దూకుడుకు మారుపేరుగా నిలిచింది. అయితే హిట్‌మ్యాన్ రిటైర్ (టీ20లకు) అయినా జట్టులో అతడు నింపిన స్ఫూర్తి మాత్రం చెక్కు చెదరలేదు. 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడాక ఐసీసీ నాకౌట్ దశలో ఎలా ఆడకూడదనేదానిపై ఓ రోడ్‌మ్యాప్ తయారుచేసుకున్న రోహిత్.. దానిని తూచా తప్పకుండా అమలుచేశాడు. అందరికంటే ముందు తనే కదిలాడు.
రోహిత్ సారథ్యంలో 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఫైనల్లో కప్పు తృటిలో చేజారినా 2024, 2025 (చాంపియన్స్ ట్రోఫీ)ల్లో మాత్రం అది మిస్ అవ్వలేదు. దూకుడు ఒక్కటే కాకుండా నిలకడగా ఆడుతూ ద్వైపాక్షిక సిరీస్‌లు నెగ్గడం, ఆసియా కప్, ఐసీసీ వంటి భారీ టోర్నీల్లో ఆ సూత్రాన్ని పాటిస్తూ భారత్ ఫలితాలు రాబడుతున్నది. 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి తాజా ఎడిషన్ వరకూ ఐసీసీ టోర్నీల్లో 35 మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా.. కేవలం రెండంటే రెండు మ్యాచ్‌లోనూ ఓడగా ఒకదాంట్లో ఫలితం రాలే దు. ఏకంగా 32 మ్యాచ్‌ల్లో మనదే గెలుపు.
2024 ప్రపంచకప్ వరకూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కోసం కోట్లాది కండ్లతో ఎదురుచూసిన అభిమానులకు బార్బడోస్ తర్వాత ట్రోఫీల వరద మొదలైంది. 2025లో చాంపియన్స్ ట్రోఫీ, నిరుడు స్వదేశంలో మహిళామణులు తమ తొలి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణధ్యాయం. గతేడాది ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న సూర్య సేన.. తాజాగా టీ20 ప్రపంచకప్‌నూ నెగ్గి కొత్త చరిత్ర సృష్టించింది. ఇదీగాక ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్ కూడా భారత్‌దే కావడం విశేషం. ఇదే స్ఫూర్తి కొనసాగితే కెప్టెన్ సూర్య చెప్పినట్టు.. ‘మా తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే’ అన్న కలను నెరవేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.