హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సొంతంగా లాంచ్ ప్యాడ్‌ను నిర్మించనున్నట్టు ప్రకటించింది. వారి తొలి ఆర్బిటాల్ మిషన్ విక్రమ్-1 ‘ఆగమన్’ ద్వారా బహుళ పేలోడ్స్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రైవేట్ రంగంలో భారత్‌లో తయారై కక్ష్యను చేరిన మొదటి రాకెట్‌గా విక్రమ్-1 రికార్డు సృష్టించింది. ప్రారంభ మిషన్ల కోసం ఇస్రో సౌకర్యాలనే ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తున్నప్పటికీ, ఇప్పటికే స్వతంత్ర లాంచ్ పనులపై దృష్టి సారించింది. స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పవన్ చందన మాట్లాడుతూ.. “మేము ఇస్రోతో సుదీర్ఘకాలం కలిసి పనిచేశాం. మొదటి కొన్ని మిషన్లు ఇస్రో కేంద్రాల నుంచే జరుగుతాయి. అయితే మా సొంత లాంచ్ ప్యాడ్‌ను నిర్మించే ప్రణాళికలు మా వద్ద ఉన్నాయి” అని తెలిపారు. దీనికి సంబంధించిన స్థలం లేదా సమయపాలనను ఆయన వెల్లడించనప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని అన్నారు.
సొంత లాంచ్ ప్యాడ్ ఉండడం వల్ల స్కైరూట్‌కు మరింత కార్యాచరణ స్వేచ్ఛ లభిస్తుంది. శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మౌలిక సదుపాయాలపై మాత్రమే పూర్తిగా ఆధారపడకుండా స్వతంత్రంగా లాంచ్‌లను షెడ్యూల్ చేయడానికి వీలవుతుంది. భారత్‌లో అంతరిక్ష రంగ సంస్కరణల తర్వాత ప్రైవేట్ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో ఈ నిర్ణయం తెలియజేస్తున్నది. స్కైరూట్ రాబోయే విక్రమ్ మిషన్లు, వాణిజ్య ప్రయోగాల కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రత్యేక లాంచ్ కాంప్లెక్స్ అత్యంత కీలకమైన మౌలిక సదుపాయంగా మారనుంది. ఇది కంపెనీ సేవలను విస్తరించడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ స్మాల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లో పోటీ పడటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ నిర్ణయం భారతీయ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి, అందులో స్కైరూట్ ఏరోస్పేస్ మహత్తర ప్రణాళికలకు ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.
లాంచ్ ప్యాడ్ అంటే ఎంత ఖర్చవుతుంది?
లాంచ్‌ప్యాడ్ అనేది రాకెట్లను నిలబెట్టి, అంతరిక్షంలోకి లేదా కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన నిర్మాణం లేదా వేదిక. దీనిలో రాకెట్‌కు ఇంధనం నింపే వ్యవస్థ, రాకెట్‌ను సురక్షితంగా పట్టుకునే సపోర్టింగ్ టవర్స్, విద్యుత్తు సరఫరా వ్యవస్థ, కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించే పరికరాలు, గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ అమర్చబడి ఉంటాయి. రాకెట్ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు రాకెట్ పరిమాణం, అది మోసుకెళ్లే బరువు, ఉపయోగించే ఇంధన రకం(క్రయోజనిక్ లేదా సెమి క్రయోజనిక్) తదితరాలపై ఆధారపడి ఉంటుంది.
భారత ప్రభుత్వం, ఇస్రో శ్రీహరికోటలో నిర్మించతలపెట్టిన మూడో లాంచ్ ప్యాడ్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ. 3,985 కోట్లు. ఈ ప్యాడ్‌ను పెద్దతరహా రాకెట్లు(ఎన్జీఎల్వీ, హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్/గగన్‌యాన్ లాంటి మానవసహిత యాత్రలు) ప్రయోగించడానికి అనువుగా అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. చిన్న తరహా ప్రైవేట్ రాకెట్లు ప్రయోగించడానికి అవసరమైన లాంచ్ ప్యాడ్స్ లేదా మొబైల్ లాంచ్ స్టాండ్లు నిర్మించడానికి సుమారు రూ. 80 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు ఖర్చు కావచ్చు. స్కైరూట్ ఇలాంటి లాంచ్ ప్యాడ్ నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక స్టార్‌షిప్ లేదా నాసా నిర్మించే లాంచ్ కాంప్లెక్స్‌లకు రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చవుతుంటుంది.