లెజెండరీ యాక్టర్ కమల్‌హాసన్, విఖ్యాత దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రానున్న పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏ.ఆర్.రెహమాన్ స్వరకల్పనలో ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు విడుదల కాగా, సొమవారం నాలుగో పాటను విడుదల చేశారు. ‘విశ్వద నాయకా.. విహిత వీరా.. మనసు నీకై.. రథమై రాదా..’ అంటూ సాగే ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, అలెగ్జాండర్ జాయ్ ఆలపించారు.
ప్రశాంత్ వెంకట్ రాసిన ర్యాప్‌ను ఏ.ఆర్ అమీన్ అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు ఈ ర్యాప్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులోని కమల్‌హాసన్ పాత్రను ప్రజెంట్ చేసేలా ఈ పాట సాగింది. ఈ పాటలో కమల్‌హాసన్ డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తుండటం విశేషం. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జాయింట్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ ద్వారా ఎన్.సుధాకర్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్న విషయం విదితమే.
కోర్టుకెళ్లిన కమల్.. ఇదిలావుంటే.. ‘థగ్‌లైఫ్’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమాను ప్రదర్శించుకునేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కమల్‌హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ‘థగ్ లైఫ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. కమల్ క్షమాపణ చెప్పకపోతే ‘థగ్ లైఫ్’ విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. దీంతో న్యాయపరమైన జోక్యాన్ని కోరుతూ కమల్ కోర్ట్‌ను ఆశ్రయించారు.