లడాఖ్: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్(సీఎస్ఐఆర్) పరిశోధకులు కొత్త విషయాన్ని కనుగొన్నారు. లడాఖ్ (Ladakh) మట్టిలో ఉండే సూక్ష్మజీవుల ద్వారా క్యాన్సర్, టీబీ, డయాబెటిస్‌కు చికిత్సను అందివ్వోచ్చు అని తేల్చారు. అక్కడి సూక్ష్మజీవుల్లో ఉండే రసాయనక పదార్ధంతో అనేక మొండి వ్యాధులకు ట్రీట్మెంట్ చేయవచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్ట్రెప్టోమైసెస్ నెట్రోప్సిస్ అనే బ్యాక్టీరియాను పరిశోధకులు విశ్లేషించారు. ఆ సూక్ష్మజీవిలో సుమారు 13 రకాల రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఆల్కలాయిడ్స్‌లో పింప్రినితైన్ అనే పదార్థం ఉన్నట్లు కనుగొన్నారు.
సమగ్రమైన స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్‌లతో ఆ రసాయనాన్ని అధ్యయనం చేశారు. పింప్రినితైన్తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నట్లు నిర్ధారించారు. యాంటీ మైక్రోబియల్, సైటోటాక్సిక్ యాక్టివిటీ ఆ పదార్ధంలో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కణాల చికిత్సలో ఈ పదార్థం కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సీఎస్ఐఆర్ పరిశోధకులు చెప్పారు. అంటువ్యాధులు, నాన్ కమ్యూనికెబుల్ వ్యాధుల చికిత్సలో పింప్రినితైన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేల్చారు. సీఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసర్చ్ సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి.
బయోరిసోర్స్ టెక్నాలజీ జర్నల్‌లో దీనిపై సమీక్షను ప్రచురించారు. సూక్ష్మజీవుల్లో ఉండే కొన్ని రకాల సహజసిద్దమైన రసాయనాల్లో యాంటీబయాటిక్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నట్లు స్టడీలో పేర్కొన్నారు. హృద్రోగ సంబంధిత వ్యాధుల చికిత్సలోనూ ఆ రసాయనాలు కీలకం అవుతాయన్నారు. లేహ్-లడాఖ్‌లోని హిమాలయ ప్రాంతం సూక్ష్మజీవులకు అనుకూలమైందని పరిశోధకులు చెప్పారు.