Shreyashi Joshi | సీనియర్ ఉమెన్స్ క్లాసిక్ లిషుయ్ ఇన్లైన్ ఫ్రీస్టైల్ అంతర్జాతీయ టోర్నీ చైనాలో ఆగస్టు 9 నుంచి 12 వరకు నిర్వహించారు. ఈ టోర్నీలో భారత స్కేటింగ్ క్రీడాకారిణి శ్రేయాషి జోషి బ్రాంజ్ (Bronz) మెడల్‌ను గెలుచుకుంది. దీంతో ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను సాధించి రీజియన్‌లో పేరు తెచ్చుకున్న శ్రేయాషి అంతర్జాతీయంగా కూడా సత్తా చాటింది.
మహారాష్ట్రలోని పుణె (Pune)లో జన్మించిన శ్రేయాషి జోషి మూడేండ్ల వయసు నుంచే సోదరి స్వరాలితో కలిసి స్కేటింగ్ ఆడటం ప్రారంభించింది. ఆరేండ్ల వయసు వచ్చేసరికి జాతీయ క్రీడాకారిణి ఎదిగింది. 59వ నేషనల్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్పీడ్ స్లాలోమ్, క్లాసిక్ స్లాలోమ్ రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ చాంపియన్‌షిప్స్ 2021లో మొహాలిలో నిర్వహించారు. అదేవిధంగా 2024, బెంగళూరులో నిర్వహించిన 62వ నేషనల్ చాంపియషిప్స్లో కూడా స్పీడ్, క్లాసిక్ స్లాలోమ్ రెండింట్లోనూ గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించిన భారతీయ స్కేటర్లలో జినేష్ నానల్తో పాటు శ్రేయాషి ఒకరు.
చైనాలోని నాన్జింగ్లో 2017లో జరిగిన వరల్డ్ రోలర్ గేమ్స్‌లో 12 ఏండ్ల వయసులోనే ఫ్రీస్టైల్, స్పీడ్ విభాగాల్లో 20, 22వ స్థానాల్లో నిలిచి 19 ఆసియా క్రీడల (Hangzhou 2023) పోటీలకు ఎంపికయ్యింది. సౌత్ కొరియాలో 2025లో జరిగిన ఆసియన్ రోలర్ స్కేటింగ్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. దీంతో ఇన్లైన్ ఫ్రీస్టైల్, క్లాసిక్ స్లాలోమ్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది.