– పట్టించుకోని అధికారులు
– భయాందోళనలో కాలనీవాసులు
తుంగతుర్తి, ఆగస్టు 11 : తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. ఈ ట్రాన్స్ఫార్మర్లు కనీసం నాలుగు ఫీట్ల ఎత్తు కూడా లేకపోవడంతో చిన్న పిల్లలు పట్టుకున్నా అందే విధంగా ఉన్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్య గురించి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు, గ్రామ పంచాయతీ పాలకవర్గానికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎలాంటి ప్రమాదాలు జరగకముందే జిల్లా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మనుషులకు అందకుండా స్తంభాల చుట్టూ ఒక దిమ్మెను నిర్మించి వాటిపైన ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.