Kai Trump : అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నివాసమైన ‘మార్ ఎ లాగో (Mar-a-Lago)’ గోడ దూకేందుకు యత్నించిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. అతడు వారిని షాక్ గురిచేసే సమాధానం చెప్పాడు. తాను డొనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ (Kai Trump) ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, అందుకే గోడ దూకే ప్రయత్నం చేశానని తెలిపాడు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంథోనీ థామస్ అనే 23 ఏళ్ల వ్యక్తి మంగళవారం ట్రంప్ ఇంటి గోడ దూకేందుకు యత్నించాడు. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు గోడ దూకే ప్రయత్నం చేశావని వారు ప్రశ్నించగా.. అతడు షాకింగ్ సమాధానం ఇచ్చాడు. తాను ట్రంప్‌నకు ఒక శుభవార్త చెప్పడానికి వెళ్లానని, ఆయన మనవరాలు కై ట్రంప్‌ను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని థామస్ తెలిపాడు.
కాగా థామస్ ట్రంప్ ఇంటి గోడ దూకడం ఇది రెండోసారని అధికారుల విచారణలో తేలింది. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నట్లు ఆయన తెలిపారు. థామస్ రెండోసారి తన ఇంటి గోడ దూకే ప్రయత్నం చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో ఉన్నారని, దీనిపై ఆయనకు సమాచారం అందించామని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం థామస్‌ను పామ్‌బీచ్‌లోని జైలుకి తరలించారు.
కాగా ‘మార్ ఎ లాగో’ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. ఇక్కడికి సందర్శకులను, అతిథులను ఎవ్వరినీ అనుమతించరు. గతంలో ట్రంప్‌పై హత్యాయత్న ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో అధికారులు భద్రతను భారీగా పెంచారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.