Wrong injection : ఆస్పత్రిలో వైద్య సిబ్బంది (Medical staff) నిర్లక్ష్యం ఆరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ (Wrong injection) ఇవ్వడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా (Odisha) లోని కోరాపుట్ జిల్లా (Koraput district) కేంద్రంలో గల సాహిద్ లక్ష్మణ్ నాయక్ (Sahid Laxman Naik) మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రి ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు నిన్న రాత్రి వేళ గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు మరణించడానికి కొన్ని నిమిషాల ముందు సిబ్బంది రెండో రౌండ్ ఇంజెక్షన్లు వేసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ నర్సు వచ్చి తమ పక్కన ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్ ఇచ్చారని, మా సోదరికి కూడా ఇచ్చారని, ఆ తర్వాత కొన్ని క్షణాలకే అందరూ నొప్పితో విలవిల్లాడుతూ చనిపోయారని ఓ మృతురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ఆందోళన కొనసాగుతుండగానే.. మరో రోగి మరణించాడని, ఇవాళ (బుధవారం) ఉదయం కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో రోగికి ఇంజెక్షన్ ఇచ్చారని, కాసేపటికే ఆ రోగి కూడా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 6కు చేరిందని రోగుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. చనిపోయిన రోగులంతా ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారని, సర్జరీ తర్వాత వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని మృతుల కుటుంబసభ్యులు తెలిపారు.
ఎప్పుడైతే ఇంజెక్షన్ డోసు ఇచ్చారో ఆ తర్వాతే వారి ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించిందని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టంచేశారు. పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం ఇంకా స్పందించలేదు.
ఇదిలావుంటే కాంగ్రెస్ నేతలు వైద్య కళాశాల వద్ద ధర్నాకు దిగారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.