ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్‌పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యాపార అవసరాలకు వినియోగించే కమర్షియల్ సిలిండర్ల వాడకంపై ఏకంగా 75 శాతం కోత విధించింది. వంట గ్యాస్ సిలిండర్లు కూడా బుక్ చేసిన వారం పది రోజుల తర్వాత డెలివరీ చేస్తుండగా, మళ్లీ బుక్ చేయడానికి 25 రోజుల గడువు పెట్టారు.
దుబ్బాక,మార్చి11: వంటింట్లో గ్యాస్ మంట భగ్గుమంటున్నది. ఎల్పీజీ ధరలను కేంద్రం భారీగా పెంచడంతో సామన్య, పేదలపై మరింత భారం పడింది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కుదేలవుతున్న ప్రజలపై మరోసారి మోదీ సర్కారు గ్యాస్ సిలిండర్ రూపంలో భారీ పిడుగు వేసింది. గృహ అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.60 పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. సిలిండర్ ధరను భారీగా పెంచటంతో సిద్దిపేట జిల్లా ప్రజలపై దాదాపు రూ.2 కోట్ల అదనపు భారం పడనుంది. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాల కారణంగా కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచింది.
యుద్ధాలతో గ్యాస్ ,పెట్రో ధరలు పెంచమన్న కేంద్రం ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఏడాదిలో రెండుసార్లు గ్యాస్ సిలిండర్ ధర పెంచి ప్రజలపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపింది. గత సంవత్సరం ఏప్రిల్‌లో సిలిండర్‌పై రూ.50 పెంచింది. ప్రస్తుతం యుద్ధాల కారణంగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచింది. గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో… 3.12 లక్షల గ్యాస్ కనెక్షన్లు
ప్రస్తుతం ప్రతి ఇట్లో గ్యాస్ వినియోగం తప్పనిసరిగా మారింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి కుటుంబంలోనూ గ్యాస్ స్టౌవ్పైనే వంటలు చేస్తున్నారు.ఒక కుటుంబానికి సగటునా ఏడాదికి 8 నుంచి 12 సిలిండర్లు వినియోగిస్తుంటారు. సిద్దిపేట జిల్లాలో 3.12 లక్షల మందికి (డొమెస్టిక్) గృహ అవసరాల కోసం గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేందుకు 19 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. నెలకు సుమారు 17 వందల టన్నుల గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 60 పెంచడంతో సిద్దిపేట జిల్లా ప్రజలపై సుమారు రూ.1.90 కోట్ల భారం పడనుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ సర్కారు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం అందించే సబ్సిడీ నోచుకోక మరో పక్క పలు గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌పై అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారు.
ప్రజలపై గ్యాస్ ధరల మోత
గృహ అవసరాలకు (డొమెస్టిక్) వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర ఏకంగా రూ.60 పెంచడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇంతకు ముందు ఒక సిలిండర్‌పై రూ.940 ఉండగా ఈ నెల 7 నుంచి రూ.60 కేంద్రం భారం మోపింది. దీంతో సిలిండర్ ధర రూ.1000కి చేరింది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం గృహ అవసరాలకు (డొమెస్టిక్) వినియోగిస్తున్న సిలిండర్ ధర రూ. 1010లకు గ్యాస్ ఏజెన్సీలు డెలివరీ చేస్తున్నాయి. ఒక్కసారిగా సిలిండర్‌పై రూ.60 ధర పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడింది. సిద్దిపేట పట్టణంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా వెంటనే ఏజెన్సీలు సకాలంలో డెలివరీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వారం, పదిరోజుల తర్వాత సిలిండర్ సరఫరా చేస్తుండటంతో సమస్యగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదల గురించి పట్టించుకునే ప్రభుత్వం లేదు
పేదల గురించి ఆలోచించే సర్కా రు లేదు. కంచె చేను మేసిన చందం గా ప్రజలను దోచుకునే ప్రభుత్వాలు తయారయ్యాయి. బయట కూరగాయలు, పండ్లు , నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నం టాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం ఇష్టానుసారంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సరైంది కాదు. ఏడాదిలో రెండుసార్లు సిలిండర్ ధర పెంచింది. ఇప్పుడు ఒక్కసారి రూ.60 పెంచడం తగదు. పెంచిన ధరను ప్రభుత్వం వెంటనే తగ్గించి పేదలను ఆదుకోవాలి.
– దార ప్రమీల, మిరుదొడ్డి, (సిద్దిపేట జిల్లా)
గ్యాస్ ధర రూ.60 పెంచడం సరికాదు
పేదలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. 10 నెలల కిందట రూ. 50 ధర పెంచింది. ఇప్పుడు యుద్ధాల పేరుతో మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెంచ డం సరైంది కాదు. ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించకుండా కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్ట డం తగదు. గ్యాస్ సిలిండర్ ధర పెంచమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇష్టానుసారంగా పెంచడం బాధాకరం.
– గోరిట్యాల నాగలక్ష్మి, దుబ్బాక, (సిద్దిపేట జిల్లా)