BFS : మీ పరిసరాల్లో కురిసే భారీ వర్షాన్ని (Heavy rain), మీకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న మీ స్నేహితుడి పరిసరాల్లో ఉన్న తేలికపాటి వర్షాన్ని (Light rain) కచ్చితంగా అంచనా వేయగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒక జిల్లాలోని ఓ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తుందని అంచనా కట్టే సూపర్ పవర్ (Super power) మీకు ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహకు తెచ్చుకోండి. అదీ ఓ 10 రోజుల ముందుగానే చెప్పగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ.. అది సాధ్యమయ్యే పని కాదులే అనుకుంటున్నారా..?
కానీ అలా కచ్చితమైన అంచనా కట్టడం ఇప్పుడు సాధ్యమే. భారతీయ శాస్త్రవేత్తలు ‘భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ (BFS)’ అని పిలువబడే సూపర్-డిటెయిల్డ్ కంప్యూటర్ మోడల్‌ను అభివృద్ధి చేశారు. దాంతో ఊహలకే పరిమితమైన ఈ అంచనా సామర్థ్యం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. అంతేకాదు 10 రోజులు ముందుగానే చిన్న వర్షపు మేఘాలను చూడటంలోనైనా, భారీ వర్షాన్ని అంచనా కట్టడంలో అయినా ఈ బీఎఫ్ఎస్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. వాస్తవానికి ఈ కొత్త అంచనా వ్యవస్థ అంతర్జాతీయ వాతావరణ మోడలింగ్ వ్యవస్థల కంటే మెరుగైనదిగా ఉంటుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసిన హై-రిజల్యూషన్ BFS మోడలింగ్ వ్యవస్థ ప్రతి 6.5 కిలోమీటర్ల పరిధిలో వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేయగలదు, నిర్ధారణ చేయగలదు. అంటే ఈ BFS వ్యవస్థ చిన్నపట్టణాల నుంచి గ్రామాల వరకు వాతావరణ మార్పులను చాలా సూక్ష్మంగా అంచనా వేయగలదు. ఈ 6.5 కిలోమీటర్ల రిజల్యూషన్ మోడల్ ప్రస్తుతం ఉన్న 12 కిలోమీటర్ల రిజల్యూషన్ మోడల్ కంటే చాలా సూక్ష్మ స్థాయిలో వాతావరణ నమూనాలను చూడగలుగుతుంది. అంచనా వేయగలుగుతుంది.
సాంకేతికంగా హై-రిజల్యూషన్ గ్లోబల్ ఫోర్కాస్టింగ్ మోడల్ (HGFM) అని పిలువబడే BFS.. యునైటెడ్ స్టేట్స్ సహా బహుళ దేశాలు ఉపయోగించే సంఖ్యా వాతావరణ అంచనా నమూనా అయిన ప్రస్తుత హై-ఎండ్ గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ (GFS) తో పోల్చబడింది. మార్చిలో ప్రతిష్టాత్మక యూరోపియన్ జియోసైన్సెస్ యూనియన్ (EGU) లో తమ ‘హై-రిజల్యూషన్ గ్లోబల్ ఫోర్కాస్ట్ మోడల్’ అనే వర్క్‌ను IITM వాతావరణ పరిశోధకులు ప్రచురించారు. వాతావరణ వైపరీత్యాలను ముందే అంచనా వేయగలిగే ఈ వ్యవస్థ ప్రజలకు చాలా ముఖ్యమైనది.
పరిశోధనలో భాగంగా IITM వాతావరణ శాస్త్రవేత్తలు జూన్ 2022 నుంచి సెప్టెంబర్ 2022 వరకు ప్రతిరోజూ HGFM మోడల్‌ను అమలు చేశారు. వారి కొత్త మోడల్ గత సంఘటనలను ఎలా అంచనా వేసిందో చూడటానికి వారు చారిత్రక డేటాను ఉపయోగించారు. రాబోయే రుతుపవన వర్షాలను 10 రోజుల ముందుగానే ఈ మోడల్ అంచనా వేయగలదని, వరదలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఉంటుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.
ఇప్పటివరకు వాతావరణ పరిశోధకులు పెద్ద ప్రాంతాల్లో మాత్రమే రుతుపవన మేఘాల కదలికలు, గాలి నమూనాలను కచ్చితంగా అంచనా వేయగలిగారు. నిర్దిష్ట ప్రాంతాలలో లేదా ప్రదేశాలలో పడే వర్షాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టంగా ఉండేది. నిర్దిష్ట ప్రదేశాలలో రోజువారీ లేదా వారంవారం వాతావరణ మార్పును వారు అంచనా వేయలేకపోయారు. ఇటీవల ప్రారంభమైన BFS వ్యవస్థతో పరిశోధకులు ఇప్పుడు ఒక నిర్దిష్ట గ్రామంలో, చిన్న పట్టణంలో కుండపోత వర్షం పడుతుందా.. లేదంటే తేలికపాటి చినుకులు పడుతాయా అని కచ్చితంగా అంచనా వేయగలుగుతారు.