CA Suicide : హీలియం గ్యాస్ (Helium gas) పీల్చి యువ సీఏ ఆత్మహత్య (CA suicide) కు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని బెంగాలీ మార్కెట్ ఏరియా (Bengali market area) లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్ (Gurugram) లోని ఓ కంపెనీలో సీఏగా పనిచేస్తున్న అతడు.. ఘజియాబాద్ (Ghaziabad) కు చెందిన ఓ సప్లయర్ నుంచి రూ.3500లు పెట్టి హీలియం గ్యాస్ కొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
జన్‌పథ్ సమీపంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉన్న 25 ఏళ్ల సీఏ తన గదిలోనే హీలియం గ్యాస్ పీల్చి మరణించాడు. గడువు ముగిసినా అతడు గది నుంచి బయటికి రాకపోవడంతో గెస్ట్ హౌస్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడటంతో అతడు శవమై కనిపించాడు. గదిలో హీలియం గ్యాస్ సిలిండర్ కూడా లభ్యమైంది. మృతుడి జేబులో సూసైడ్ నోట్ కూడా దొరికింది.
‘ఒకవేళ మీరు నా ఫేస్బుక్ పోస్టు చూడకపోయినా, ఎవరైనా నా పోస్టును డిలీట్ చేసినా నా ఆత్మహత్య గురించి తెలియజేయడం కోసం ఈ నోట్ రాస్తున్నా. నేను దూరంగా వెళ్లిపోతున్నా. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నాకు రెండేళ్ల వయస్సులో అంటే 23 ఏళ్ల క్రితం నేను తండ్రిని కోల్పోయాను. ఆ తర్వాత నా తల్లి మరో వ్యక్తిని పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి మా నానమ్మ, తాత నన్ను పెంచి పెద్దచేశారు. ఇటీవల మా నానమ్మ మరణంతో నాకు జీవితంపై విరక్తి కలిగింది. ఒంటరిగా ఉన్నా, బయటి వ్యక్తులతో కలిసి ఉన్నా నా జీవితంలో పెద్దగా తేడా అనిపించడం లేదు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటన నా పుట్టుక. అత్యంత అందమైన ఘటన నా చావు. మీరు ఈ నోట్ చదివేటప్పటికి నేను మరణించి ఉంటాను. నేను జీవితంలో ఎవరితోనూ పెద్దగా కనెక్ట్ కాలేదు. నా చావుకు ఎలాంటి కారణం లేదు. పశ్చాత్తాపం లేదు. ఎలాంటి ఫిర్యాదు లేదు’ అని ఆ యువ సీఏ తన సూసైడ్ నోట్లో రాశాడు.
అదేవిధంగా ‘నా మరణానికి ఎవరినీ బాధ్యులను చేయొద్దు’ అని తన సూసైడ్ నోట్లో పోలీసులను కోరాడు. తన బాడీ పార్ట్స్‌ను ఎవరికైనా దానం చేయాలని, తన ఆస్తులను అనాథ శరణాలయాలకు ఇవ్వాలని, ఇది తన ఆఖరి కోరిక అని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.