Tsunami : రష్యా (Russia) తీరం కంచట్కా (Kamchatka) ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పుదిశగా 136 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రతను 8.8గా గుర్తించారు. ఈ భూకంపం తీవ్రతవల్ల రష్యాతోపాటు జపాన్ (Japan), అమెరికా (USA) తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. దాంతో భారత్‌కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అనుమానాలపై ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)’ స్పందించింది. భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. ఈ మేరకు ఇన్కాయిస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. కాగా కంచట్కా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అనంతరం సునామీ ఉద్భవించింది.
అయితే ఈ భూకంపంవల్ల భారత్‌కు సునామీ ముప్పు లేదని, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని ఇన్కాయిస్ తన పోస్టులో వెల్లడించింది. ఇదిలావుంటే భూకంపం తర్వాత రష్యా, జపాన్‌తోపాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకింది. అమెరికాలోనూ సునామీ హెచ్చరికలు జారీచేశారు. దాంతో హవాయి ద్వీపంలో అలర్ట్ ప్రకటించారు.