మాస్కో: రష్యాలోని కామ్చట్కా ద్వీపంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం(Earthquake) వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ శక్తివంతమైన భూకంపం వచ్చిన సమయంలో.. కామ్చట్కా ఆంకాలజీ సెంటర్(Kamchatka Oncology Center)లో ఓ పేషెంట్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. ఒకవైపు ఆంకాలజీ సెంటర్ భూకంప తీవ్రతకు ఊగిపోతున్నా.. సర్జరీ రూమ్‌లో ఉన్న వైద్యులు మాత్రం ధైర్యంగా అక్కడ నిలుచున్నారు. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది. ఆంకాలజీ సర్జరీ రూమ్ తీవ్రంగా వణికిపోతున్నా.. మెడికల్ బృందం చాలా ప్రశాంతంగా పేషెంట్ బెడ్ వద్దే ఉన్నారు. ఆపరేషన్ రూమ్‌ను విడిచి వెళ్లేందుకు నిరాకరించారు.
కామ్చట్కా ఆరోగ్య శాఖ మంత్రి ఓలేగ్ మెల్నికోవ్ ఆ ఘటన వీడియోను షేర్ చేశారు. డేంజర్ ఉన్నా.. డాక్టర్లు పేషెంట్ వద్దే ఉన్నట్లు మంత్రి తన అధికారిక టెలిగ్రాం ఛానల్లో రాశారు. ప్రస్తుతం ఆ పేషెంట్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన విపత్తు సమయంలోనూ డాక్టర్లు చూపిన ప్రొఫెషనలిజం ప్రశంసనీయమని ఆయన అన్నారు.