కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 28 : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అనేక ప్రాంతాల్లో వీధులన్నీ రాత్రయితే చీకట్లు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా విలీన గ్రామాల్లో అయితే, పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. తమ ప్రాంతాల్లో వీధిదీపాలు వెలగడం లేదని స్థానికులు, ప్రజాప్రతినిధులు అనేక మార్లు అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఈ విభాగంలో సామగ్రి లేకపోవడంతో వీధిదీపాల నిర్వహణ, కొత్త లైట్ల ఏర్పాటు, మరమ్మతులు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఏడాది కాలానికి పైగా వీధిదీపాల నిర్వహణకు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. నగరపాలక సంస్థ నుంచి అరకొరగా కేటాయిస్తున్న నిధులు వీదిధీపాల విభాగాలను కొనుగోలు చేయటానికి సరిపోవడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. దీంతో ఎక్కడైనా మరమ్మతులు వస్తే వాటిని బాగు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గతేడాది సుమారు రూ.60 లక్షలతో సామగ్రి కొనుగోలు చేసిన అది ఏ మూలకూ సరిపోలేదన్న విమర్శలు వస్తున్నాయి.
సామగ్రి లేదు…. మరమ్మతులు కరువు
నగరంలో సుమారు 2 వేలకు పైగా వీధిదీపాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే, వీటికి సంబంధించి విడిభాగాలు అందుబాటులో లేవని తెలుస్తోంది. అలాగే, విస్తరిస్తున్న కాలనీల్లోనూ కొత్తగా వేస్తున్న పోల్స్‌కు వీధిదీపాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా పోయింది. నగరంలోని కాపువాడ, అశోక్‌నగర్, భగత్‌నగర్, రాంచంద్రపూర్కాలనీ, భాగ్యనగర్, తదితర ప్రాంతాల్లో అనేక వీధుల్లో వీధిదీపాలకు మరమ్మతులు లేకపోవడంతో రాత్రయితే వీధులు చీకటిమయమవుతున్నాయి. మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించినా సామగ్రి లేకపోవడంతో చేయడం లేదని కార్పొరేటర్లే చెబుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో నూతన పాలకవర్గం వీధిదీపాల విషయంలో దృష్టి సారించాల్సినా అవసరం ఉంది.
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తపల్లి/ కలెక్టరేట్, ఫిబ్రవరి 28 : హైదరాబాద్ బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతి ప్రవేశాల కోసం అర్హత గల గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.. విద్యార్థులు ఈనెల 12లోగా తమ దరఖాస్తులను కరీంనగర్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని, ఇతర వివరాలకు 8686451313 సెల్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
సేల్స్ అసిస్టెంట్, రిటైల్ నైపుణ్యాల్లో శిక్షణ
తిమ్మాపూర్, ఫిబ్రవరి 28: మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల మహిళా ప్రాంగణంలో రిటైల్, సెల్స్ అసిస్టెంట్ నైపుణ్యాలపై ఉమ్మడి జిల్లా మహిళా యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంగణం మేనేజర్ సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ కౌశల్య యోజన పథకం కింద గ్రామీణ యువతకు రిటైల్ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. పదో తరగతి చదివి, 18 నుంచి 35 ఏండ్ల వయసున్న వా రు రెండు ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో ఎల్ఎండీ కాలనీలోని ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7660022511 నంబరులో సంప్రదించవచ్చన్నారు.