అమరావతి : కల్తీ పాలు ( Adulterated milk ) తాగిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం రాజమండ్రి ( Rajamandry ) ఆసుపత్రిలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకొని, బాధిత కుటుంబాలను ఓదర్చారు.
ఈ ఘటనలో 11 మంది మరణించగా, ఇంకా 9 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడటం చూస్తే, రాష్ట్రంలో కనీసం స్వచ్ఛమైన పాలు కూడా అందించడంలో నిఘా పెట్టలేని ప్రభుత్వం ఉంటే ఎంత ? ఊడితే ఎంత ? అంటూ మండిపడ్డారు. ఏఐ (AI ) మీద పెట్టే శ్రద్ధలో పావు వంతైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజారోగ్యం మీద పెట్టాలని సూచించారు.
ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. జనాభా కనమని చెప్పడం కాదు. ఉన్న వాళ్లకు ప్రజారోగ్యంపై భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో సంభవించిన 11 మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపించారు.
చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని, చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేవారు. రాష్ట్రంలో పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్ధానాలు కల్తీ. మొత్తం పాలనే కల్తీ అని విమర్శించారు. 11 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా వరలక్ష్మి డైరీ నడుస్తుంటే చర్యలేవి ? తనిఖీలు ఎక్కడ ? అంటూ ప్రశ్నించారు. ఈ ఘటన యాదృచ్ఛికం కాదు .. పూర్తి నిర్లక్ష్యమని అన్నారు. సైతాన్ సైన్యానికి ఆపద వస్తే తప్పా జగన్ మోహన్ రెడ్డి సైతం బయటకు రారని ఆరోపించారు.