Union Govt : చక్కెర ధరల (Sugar Price) ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం (Uniong Govt) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చక్కెర డీలర్లు 30 రోజులకు మించి స్టాకు నిలువ ఉంచరాదని, గరిష్ఠంగా నాలుగు వేల క్వింటాళ్ల వరకు మాత్రమే నిల్వ ఉంచాలని ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా ఇంతకుమించి నిల్వలు ఉంచడానికి వీల్లేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన లెక్కలను ప్రతిరోజూ ఫుడ్ స్టాక్ పోర్టల్ (Food Stock Portal) లో అప్డేట్ చేయాల్సిందేనని నిర్దేశించింది. ఆ ఆదేశాలు ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు అమలులో ఉంటాయి.
‘చక్కెర డీలర్లు సరుకును సమకూర్చుకున్న తేదీ నుంచి 30 రోజులకు మించి స్టాకును నిల్వ ఉంచకూడదు. దేశంలో ఎక్కడా ఏ డీలరూ 4 వేల క్వింటాళ్లకు మించిన చక్కెర స్టాకు కలిగి ఉండకూడదు’ అని నోటిఫికేషన్ స్పష్టంచేసింది. ఈసారి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే చక్కెర ఎగుమతులను నిషేధించింది. చక్కెర స్టాకు నియంత్రణకై ప్రభుత్వం వెలువరించిన తాజా ఆదేశాలు ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డీలర్లకు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నియమించిన అధికారులకు వర్తించవని తెలిపింది.