టేకులపల్లి, సెప్టెంబర్ 5: సంతానం లేని మహిళకు మగ శిశువును దత్తత ఇప్పిస్తామని నమ్మించి రూ.1.40 లక్షలు తీసుకుని మోసం చేసి ఆరుగురిని టేకులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన మరో కొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ఇల్లందు డిఎస్పీ యు.వెంకన్న బాబు శనివారం విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు.
డీఎస్పీ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడకు చెందిన గౌరీగారి ప్రమీలకు వివాహమై ఎనిమిదేళ్లు అవుతున్నా పిల్లలు లేరు. చిన్నారిని దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ పోస్టును చూసిన ఖమ్మం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌లో ప్రమీలను సంప్రదించాడు. తనకు తెలిసిన వారి వద్ద మగ శిశువు ఉన్నాడని, రూ.4 లక్షలకు దత్తత ఇస్తారని ఆమెను నమ్మించాడు. అయితే.. అంత మొత్తం తన వద్ద లేదని ప్రమీల చెప్పింది. దాంతో రూ.1.40 లక్షలకు ఇద్దరి మధ్య బేరం కుందిరింది.
ప్రమీల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ను సదరు వ్యక్తి లక్ష్మీదేవిపల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన వేదలపల్లి రాంబాబుకు చెప్పి, చిన్నారిని చూపించాడు. ప్రమీల నుంచి డబ్బులు తీసుకున్న అనంతరం గొడవ జరిగినట్లు నటించి అక్కడి నుంచి పారిపోవాలని ఇద్దరూ పథకం వేశారు. రాంబాబు తన కుమారుడు రోహిత్, స్నేహితులు తాటి నాగార్జున, ఈసం రాంబాబుతో పాటు చిన్నారి తల్లిదండ్రులు మడివి వెంకటేష్, శారదను ఈ పథకంలో భాగం చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
సెప్టెంబర్ 4న ప్రమీల చిన్నారిని దత్తత తీసుకునేందుకు టేకులపల్లి ఏ కాలనీ స్మశానవాటిక సమీపంలోని ప్రాంతానికి వచ్చింది. అక్కడ రాంబాబు ఆమెకు శిశువును చూపించి రూ.1.40 లక్షలు తీసుకున్నాడు. కాసేపటికే రాంబాబు కుమారుడు, స్నేహితులు అక్కడికి చేరుకుని గొడవ పడుతున్నట్లు నటించారు. ప్రమీల, ఆమెతో వచ్చిన మరో మహిళను వారు భయపెట్టారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులను కారులో పంపించి, డబ్బులు తీసుకున్న వ్యక్తితో కలిసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఊహించని పరిణామంతో షాకైన ప్రమీల తాను మోసపోయినట్టు గ్రహించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం బొమ్మనపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న నిందితులను పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి రూ.1.40 లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన టేకులపల్లి సీఐ బి.సత్యనారాయణ, ఎస్ఐ కె.తిరుపతి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ యు.వెంకన్నబాబు అభినందించారు.