Jaishankar : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదుల దాడి (Terrorists attack) అనంతరం పాకిస్థాన్ (Pakistan) తో సింధూ జలాల ఒప్పందం (Indus Water Treaty) అమలును నిలిపివేశామని, ఆ నిలిపివేత ఇంకా కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి (India’s foreign minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) చెప్పారు. నీరు, రక్తం (Blood and Water) కలిసి ప్రవహించలేవని ఆయన వ్యాఖ్యానించారు.
బుధవారం రాజ్యసభలో మాట్లాడిన జైశంకర్.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడేవరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్న పాలకులు భారత రైతుల ప్రయోజనాల కంటే పాకిస్థాన్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన విమర్శించారు. నెహ్రూ హయాంలోని తప్పిదాలను సరిదిద్దలేమని గతంలో 60 ఏళ్లు పాలించిన వారు చెబుతూ వచ్చారని ఎద్దేవా చేశారు.
అయితే మోదీ ప్రభుత్వం నెహ్రూ పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దవచ్చని నిరూపించిందని విదేశాంగ మంత్రి అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, సింధూ జలాల ఒప్పందంపై తీసుకున్న చర్యలు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సింధూ జలాల ఒప్పందానికి అవసరమైన మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ను ఐక్యరాజ్యసమితి తొలిసారి తన నివేదికలో ప్రస్తావించిందని మంత్రి గుర్తుచేశారు.