హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. మార్చి రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే, వచ్చే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం సామాన్యులను వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక మిషన్ భగీరథపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, మంత్రులు పైకి ఎన్ని చెప్పినా, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలు చూస్తుంటే ఈ వేసవిలో నీటి కష్టాలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సమీక్షలో చర్చకు వచ్చిన ప్రధానాంశం కరెంట్ కోతలు! మిషన్ భగీరథ నీరు గ్రామాలకు చేరాలంటే పంపింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్తు అవసరం.
కానీ, గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక విద్యుత్తు కోతలు పెరగడం వల్ల నీటిని తోడటం, నిల్వ చేయడం కష్టంగా మారింది. ఓల్టేజ్ హెచ్చుతగ్గుల కారణంగా మోటర్లు కాలిపోవడం మరో శాపంగా పరిణమించింది. పల్లెల్లో అనధికారిక విద్యుత్తు కోతలు పెరగడం వల్ల ఓవర్హెడ్ ట్యాంకులు నిండటం లేదు. ఓల్టేజ్ సమస్యల వల్ల పంపు సెట్లు కాలిపోవడం, వాటిని బాగు చేయడానికి రోజుల సమయం పట్టడం శాపంగా మారింది. ఫలితంగా తాగునీరు సరఫరాకు రోజుల తరబడి అంతరాయం ఏర్పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఆవాసాల్లో 150 ఆవాసాలకు నీటి సరఫరా జరుగడం లేదని అధికారులే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
అస్తవ్యస్తంగా పర్యవేక్షణ
వేసవికి ముందే పైపులైన్ల మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించినా, వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మిషన్ భగీరథ నీటి లభ్యత పాయింట్లు, రిజర్వాయర్ల నీటి లభ్యత, నీటి పంపింగ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని సమావేశంలో అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. కొంతకాలంగా మిషన్ భగీరథ పైపులైన్ల నిర్వహణను గాలికి వదిలేశారనే విమర్శలు నిజమేనని ఈ సమావేశం స్పష్టంచేసింది. ప్రధాన పైపులైన్ల నుంచి గ్రామాల్లోని నల్లాల వరకు వందలాది చోట్ల లీకేజీలు ఉన్నా, వాటిని అరికట్టడంలో యంత్రాంగం విఫలమైంది. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉండటంతో, చిన్నపాటి మరమ్మతులు చేయడానికి కూడా క్షేత్రస్థాయి సిబ్బంది ముందుకు రావడం లేదు.
ప్రత్యామ్నాయ మార్గాలు శూన్యం
మిషన్ భగీరథపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల పాత బోర్లను, బావులను ప్రభుత్వం విస్మరించింది. ఇప్పుడు ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. భగీరథ నీరు రాకపోతే, ప్రత్యామ్నాయం లేక జనం చుక నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. సమీక్షలో అధికారులు నీటి లభ్యతపై లెకలు చెప్పినా, మారుమూల పల్లెల్లో నేటికీ గొంతు తడుపుకోవడం గగనంగా మారుతున్నది. పంచాయతీరాజ్, విద్యుత్తు, మిషన్ భగీరథ విభాగాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం ఈ సమావేశంలో తేటతెల్లమైంది. ఒక శాఖ తప్పును మరో శాఖపై నెట్టేసే ధోరణి ఈ సమావేశంలో సాక్షాత్కరించినట్టు సమాచారం. ప్రస్తుతమున్న విద్యుత్తు సమస్యలు, లీకేజీలు, మరమ్మతుల జాప్యం చూస్తుంటే.. ఈ వేసవిలో తెలంగాణ పల్లెలు నీటి యుద్ధాలకు వేదిక కావడం ఖాయమనే భయాందోళనలు ప్రజలను వెంటాడుతున్నాయి.