RTC Strike | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఈ నెల 13న సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్‌చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి వెల్లడించారు.
జేఏసీలో లేని సంఘాలకు కూడా ఈ నిర్ణయాన్ని తెలియజేస్తున్నామని, అందులో భాగంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ (ఐన్టీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి, టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హనుమంతు, ఎస్‌డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, కేఎస్-బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి ఈ స్వామికుమార్కు లేఖలు రాశామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చేపడుతున్న పోరాటంలో వారి భాగస్వామ్యం కూడా ఉండాలని కోరారు. తమను సమ్మె వైపు వెళ్లకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉన్నదని స్పష్టం చేశారు. హామీల అమలుకు ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉన్నదని, ఈలోగా కాంగ్రెస్ సర్కార్‌కు పంతాలు, పట్టింపులు వీడి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు 30% ఫిట్మెంట్తో 2021 వేతన సవరణ చేయాలని, 2025 పీఆర్సీని అమలు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులు ప్రవేశ పెట్టాలని, ప్రైవేట్ బస్సులకు ఆర్టీసీ డిపో స్థలాలు ఇవ్వరాదని, బ్రెడ్ విన్నర్ సీంలో పనిచేస్తున్నవారిని రెగ్యులర్ చేయాలనే డిమాండ్లతో సమ్మె నోటీసు ఇస్తామని వివరించారు. హామీలు అమలవుతాయని దాదాపు రెండున్నరేండ్ల నుంచి ఎంతో ఓపికతో ఎదురుచూసి విసిగిపోయామని, ఇప్పుడు తమ ఓపిక నశించిందని వాపోయారు.
రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి రూ.9,500 కోట్లు కేటాయించాలని ఐఎన్టీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. మహాలక్ష్మి పథకం, విద్యార్థులు, దివ్యాంగులు, జర్నలిస్టులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇస్తున్న సబ్సిడీ, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు బకాయిలను చెల్లించడానికి తదితర వాటిని దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.