మంచిర్యాల, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు(పీఎస్ఆర్)కు చెక్ పెట్టేందుకు సొంత పార్టీ నాయకుల కుట్రలు ఫలించాయా? జగన్మోహన్రావును పావుగా వాడుకొని పీఎస్ఆర్ రాజకీయ భవిష్యత్‌కు సమాధి కట్టేందుకు మంత్రి, ప్రభుత్వ ముఖ్యనేత స్థాయిలో వ్యూహ రచన సాగుతున్నాదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రభుత్వంలోని ఆ ముఖ్యనేతకు, ఎమ్మెల్యేకు ముందు నుంచి పొసగడం లేదు. అది మనసులో ఉండడంతోనే మంత్రి పదవి రాకుండా చేశారని, తన అనుచరుడిగా పేరున్న పక్క నియోజకవర్గ నాయకుడికి మంత్రి పదవి వచ్చేలా చేశారని లోకం కోడై కూసింది.
పార్టీలో ముందు నుంచి ఉన్న తనను కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులా అంటూ ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో అసహనం వ్యక్తం చేశారు. పార్టీపై నమ్మకంతో ఓ కార్యకర్తలా పని చేస్తానని ప్రకటించారు. తన నియోజకవర్గంలో తానే మంత్రి, తానే రాజు అని, నా ప్రమేయం లేకుండా తట్టెడు మట్టి తీయలేరంటూ అల్టిమేటం ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ముఖ్యనేతతోపాటు ఆ మంత్రికి పీఎస్ఆర్ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న ఆకాంక్ష బలమైంది.
ఇదే సమయంలో మంత్రితోపాటు ఎంపీని మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా చేస్తుండడంతో.. మంచిర్యాల నియోజకవర్గంపై పట్టు సాధించాలని ప్రభుత్వంలో కీలక నేతలిద్దరూ ఎప్పటి నుంచో కాచుకూర్చున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జగన్మోహాన్‌రావు మంత్రిని కలిసి, రానున్న ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలొచ్చాయి. దీంతో ఎమ్మెల్యేకు, బైపాస్ లీడర్ జగన్‌కు మధ్య దూరం పెరిగిందని, డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిసింది. ఇదే మంచి అవకాశంగా భావించిన మంత్రి నేరుగా ప్రభుత్వ ముఖ్యనేతకు జగన్ మధ్య సయోధ్య కుదిర్చినట్లు.. ఈ మేరకు ఈ నెల 15, 16 తేదీల్లో మంత్రి సమక్షంలో ఆ నేత బలప్రదర్శన చేయనున్నారని ప్రచారం జరిగింది.
ఒంటరైన పీఎస్ఆర్..
అధికార పార్టీ చర్యలు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మంత్రి, ప్రభుత్వ ముఖ్యనేత మరో లీడర్‌ను చేరదీయడంతో ఎమ్మెల్యే పీఎస్ఆర్ ఒంటరైపోయారన్న చర్చ స్థానికంగా నడుస్తున్నది. మొన్నటికి మొన్న బైపాస్ లీడర్‌తోపాటు 23 మంది కార్పొరేటర్లు మంత్రి సమక్షంలో బలప్రదర్శన చేస్తారని వార్తలు రావడం, కార్పొరేటర్లందరిని పిలిపించి ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ పెట్టించారు. అక్కడ పీఎస్ఆర్ వెంటే ఉంటామని ప్రకటించిన కార్పొరేటర్లు కొన్ని రోజుల వ్యవధిలోనే జగన్ పంచన చేరడం, పీఎస్ఆర్కు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది అనడానికి సంకేతంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నారు. నేను మంత్రి, నేను రాజు స్థాయి నుంచి అధికార పార్టీలో ఆయన స్థానమేంటో క్లారిటీ తీసుకోవాల్సిన స్థాయికి ఆ నాయకుడు వచ్చారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. మొత్తానికి అధికార పార్టీలో ఈ వ్యవహారం కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీయనుంది అనడంలో సందేహం లేదు. ఇది ఎటుపోయి ఎటు వస్తుందో అన్న ఆసక్తి స్థానిక ప్రజలతోపాటు రాజకీయ వర్గాల్లో పెరిగింది.
హైదరాబాద్‌లో భేటీ.. సీఎం సభలో ప్రత్యక్షం
మంచిర్యాల హస్తం పార్టీలో ఈ వ్యవహారం కలకలం రేపుతుండగానే.. శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి సన్నిహితుడు విష్ణురెడ్డితో కలిసి జగన్మోహన్రావు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారని, ఆ భేటీలో మంత్రి వివేక్ పాల్గొన్నారన్న వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే మరుసటి రోజు సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి సభలో జగన్మోహన్రావు సభావేదికపై కనిపించడం, సీఎం కారు ఎక్కే ముందు జగన్‌తో మాట్లాడిన వీడియో.. స్థానిక సోషల్ మీడియాలు, ఫొటోలు కొన్ని గంటల వ్యవధిలోనే వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌లో ముందురోజు భేటీ, అనంతరం ముఖ్యమంత్రి సభల్లో ఆ నేత కనిపించడంతో ఆయన ప్రభుత్వ ముఖ్యనేతకు దగ్గరయ్యారని, రానున్న రోజుల్లో మంచిర్యాల హస్తం పార్టీలో కీలకంగా వ్యవరించనున్నారన్న చర్చ స్థానికంగా మొదలైంది.
దీనికి మంత్రి సహాయ సహకారాలు ఉన్నాయని వార్తలు షికార్లు కొడుతున్నాయి. బైపాస్ నాయకుడితోపాటు ఒకరిద్దరూ కార్పొరేటర్లు నిన్న సీఎం సభలో కనిపించడం.. మేమే పీఎస్ఆర్ వెంటే ఉంటామని మొన్నటికి మొన్న ఇక్కడ ప్రెస్మీట్లో మాట్లాడిన నాయకులు జగన్ వెంట ఉండడం హస్తం పార్టీలో కలకలం రేపుతున్నది. మరింత మందితో జగన్ టచ్‌లో ఉన్నారని, ఇప్పటికే దండేపల్లి, లక్షెట్టిపేటలో ఎమ్మెల్యేను కాదని ఆయనకు ఆ పార్టీ నాయకులు ప్రియార్టీ ఇస్తున్నారని, దీనికి తోడు మంచిర్యాల కార్పొరేషన్‌లోని నాయకులతోపాటు పార్టీలో ఎమ్మెల్యే అంటే నచ్చని నాయకులందరూ ఆయనతో ఉన్నారన్న చర్చ నడుస్తున్నది. మంచిర్యాలలో హస్తం పార్టీ రెండుగా చీలిపోయిందన్న వాదనలకు మరింత బలం చేకూరింది. మొన్న సీఎం సభలో ఇది స్పష్టమవడంతోపాటు ఎమ్మెల్యే పీఎస్ఆర్కు చెక్ పెట్టేందుకు సొంత పార్టీలోని కీలక నేతల యాక్షన్ ప్లాన్ సిద్ధమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.