మేడ్చల్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాలలోని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చడంతో ప్రైవేట్ ఆస్తుల యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో బాధితులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, కేపీ వివేకానంద్ బాధితులకు భరోసాను ఇస్తున్నారు. బాధితులతో కలిసి వచ్చి జిల్లా కలెక్టరేట్లో అధికారులను కలుస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రైవేట్ ఆస్తులను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించనట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమానికి సిద్ధమవుతాయని హెచ్చరిస్తున్నారు. తక్షణమే నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించనట్లయితే పోరాటం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున జిల్లాలో ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే బొమ్మరాశిపేట్లో ప్రభుత్వం రైతులకు చెందిన వెయ్యి ఎకరాలకు పైగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చింది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శామీర్పేట్లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మల్కాజిగిరి నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రికార్డుల సమస్యను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పరిష్కరించిన విషయం తెలిసిందే. సుమారు 10 వేల మంది ఆస్తి యజమానులకు భారీ ఊరట లభించింది. 10 వేల మందికి చెందిన ఆస్తులు వక్ఫ్ బోర్డులు ఉన్నాయని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బాధితుల తరపున ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంపై పోరాడి సమస్యను పరిష్కరించారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి ప్రైవేట్ ఆస్తులను తొలగించేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం చేసే విధంగా చూస్తామన్నారు.