సర్కారు వైద్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రజారోగ్యంపై పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఫలితంగా ఉత్తర తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందిన కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) అధ్వానంగా మారింది. నాడు కేసీఆర్ సర్కారు కల్పించిన అనేక సదుపాయాలతో పేదల సంజీవనిగా మారిన ఈ వైద్యశాల నిర్వహణ నేడు గాడి తప్పింది. ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా సదుపాయాలు ఉన్నా.. సేవలు అందించేందుకు పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడం రోగుల ప్రాణాలమీదికి తెస్తున్నది. హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా క్యాడర్ స్టెంత్ పెంచకపోవడం మరింత ఇబ్బందికరంగా తయారవగా, పట్టని యంత్రాంగం తీరు విమర్శలకు తావిస్తున్నది. సోమవారం ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధ్యక్షతన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరుగనుండగా, సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకుతుందా.. లేదా? అన్నది వేచి చూడాల్సి ఉన్నది.
కరీంనగర్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల నిరుపేదలకు వైద్య సేవలందిస్తున్నది. ఇక్కడికి పది జిల్లాల నుంచి నిరుపేద రోగులు వస్తుంటారు. ఇక్కడ పలు రకాల వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ వైద్యులు, సిబ్బంది లేక పోవడంతో నిత్యం వందల సంఖ్యలో వస్తున్న రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న ఈ దవాఖానలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పించించింది. మెరుగైన సేవలు అందించింది. ప్రత్యేకించి కరోనా సమయంలో అందించిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. అప్పుడు కల్పించిన వైద్య సదుపాయాల్లో ఇప్పుడు చాలా వరకు వినియోగించ లేని పరిస్థితి ఉంది. ఈ దవాఖానకు అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా క్యాడర్ స్టెంత్ పెంచాల్సి ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా అనేక విభాగాల్లో వైద్యులు లేక పోవడంతో రోగులకు వైద్య సేవలు మృగ్యంగా మారాయి. రోగులను వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాట్సాప్ రిపోర్టులతోనే వైద్యం
జనరల్ హాస్పిటల్లో సిటీ స్కాన్, ఎక్స్‌రే సౌకర్యాలు ఉన్నప్పటికీ ఈ సేవలు వినియోగించుకునేందుకు వచ్చే రోగులకు మాత్రం ఇక్కడ ఏం జరుగుతున్నదో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ పరీక్షలు చేయించుకునే రోగులకు తమకు ఎలాంటి వ్యాధి ఉన్నది? అది ఏ స్థాయిలో ఉన్నది? అనే విషయం తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే రిపోర్టులు పేషెంట్ల చేతికి ఇవ్వకుండా, టెక్నీషియన్లు నేరుగా వాట్సాప్ ద్వారా వైద్యులకు పంపిస్తుంటారు. వారు పరిశీలించి రోగులకు చికిత్స అందిస్తుంటారు. ఎక్స్‌రే ఫిలిమ్స్ అందుబాటులో లేక పోవడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తున్నది. ఇంత పెద్ద దవాఖానలో కనీసం ఎక్స్‌రే, ఫిలిమ్స్ అందుబాటులో లేకపోవడం ఏమిటని రోగులు ఆశ్చర్యపోతున్నారు.
నామమాత్రపు సేవలు
దవాఖానలో అత్యవసరంగా అందించాల్సిన కార్డియాక్, న్యూరో విభాగాల సేవలు నామ మాత్రమయ్యాయి. ఈ రెండు విభాగాల్లో నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయి రహదారులు అందుబాటులో ఉన్న జిల్లాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. తలకు గాయాలై వస్తున్న క్షతగాత్రులకు ఇక్కడ సరైన వైద్యం లభించడం లేదు. న్యూరో సర్జన్ వైద్యులు అందుబాటులో లేక పోవడం, ఎంఆర్ఐ వంటి సదుపాయాలు లేక పోవడంతో వైద్యం అందించలేక పోతున్నారు. ఇలాంటి వారిని హైదరాబాద్, వరంగల్ ప్రభుత్వ దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. సకాలంలో చికిత్స అందక, ఈ నగరాలకు చేరుకోక ముందే ఎందరో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతే కాకుండా గుండెపోటుతో ఈ దవాఖానకు రోజుకు నాలుగైదు కేసులు వస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్యం అందుబాటులో లేక వారికి సేవలు అందించే పరిస్థితి లేదు. రూ.లక్షలు వెచ్చించి 2డీ ఏకో వంటి పరికరాలు ఏర్పాటు చేసినా వాటిని వినియోగించి సేవలు అందించే వైద్య నిపుణుల కొరత ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తున్నది. క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేసినా అందులో వైద్యులు, సిబ్బంది లేక పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సేవలు అందడం లేదు. ఇలాంటి అత్యంత కీలకమైన విభాగాల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడంతో సదుపాయాలు ఉన్నా వైద్య సేవలు అందని పరిస్థితి ఉన్నది.

ఆ భవనంలో ఎప్పుడు ఏం జరుగుతుందో?
జీజీహెచ్‌లో పురాతన భవనం పరిస్థితి రోజు రోజుకు శిథిలమవుతున్నది. పై కప్పు పెచ్చులూడి పడుతున్నది. గతంలో పేషెంట్లపై పడిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మరింత శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇన్ పేషెంట్లుగా ఉండే రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో పూర్తిగా శిథిలమైన కొన్ని వార్డులను మూసివేశారు. ఈ భవనం స్థానంలో ఆధునిక సదుపాయాలతో కొత్తది నిర్మించాలని రోగులు కోరుతున్నారు.
వేధిస్తున్న పెండింగ్ బిల్లులు
పలు రకాల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కరీంనగర్ జీజీహెచ్‌కు శాపంగా మారింది. వివిధ రకాల పెండింగ్ బిల్లులు రూ.12 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తున్నది. చాలా కాలంగా ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్సలు అందిస్తుండగా, అందుకు సంబంధించిన బిల్లులు రూ.4 కోట్లలో ఉన్నట్లు తెలిసింది. ఈ బిల్లులు చెల్లించినా దవాఖానలో కొన్ని సదుపాయాలను మెరుగు పర్చుకునే అవకాశం ఉండేది. మందులకు సంబంధించిన బిల్లులు రూ.4 కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో మందుల బిల్లులు పెండింగ్‌లో ఉండగా నెల, రెన్నెళ్లకోసారి రూ.లక్ష, 2లక్షల చొప్పున బిల్లులు ఇస్తున్నారు. దీంతో సరఫరాదారులు పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అలాగే దవాఖానకు సంబంధించిన విద్యుత్ బిల్లులు మరో రూ.4 కోట్లు ఉన్నట్లు సమాచారం.
నేడు హెచ్‌డీఎస్ సమావేశం
జీజీహెచ్‌లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తే నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశముంటుంది. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందా..? అని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ మీటింగ్‌కు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతోపాటు జిల్లా మంత్రుల్లో ఒకరైన పొన్నం ప్రభాకర్ హాజరయ్యే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో జీజీహెచ్‌లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరమున్నది. ముఖ్యంగా ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా క్యాడర్ స్టెంత్ను పెంచడం, క్రిటికల్ కేర్‌ను బలోపేతం చేయడం, ఎంఆర్ఐ తదితర అత్యవసర పరికరాలను అందుబాటులోకి తేవడం, పాత భవనం స్థానంలో ఆధునియ సదుపాయాలతో కొత్త భవనాన్ని నిర్మించడం, పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించడం వంటి సమస్యలపై చర్చించి ఒక పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత మంత్రులు, అధికారులపై ఎంతైనా ఉన్నది.
పేషెంట్లు ఎక్కువ.. క్యాడర్ తక్కువ
ఒకప్పుడు వైద్య విధాన పరిషత్తు పరిధిలోని ఈ దవాఖానకు అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తెచ్చారు. అయితే కళాశాలలో సీట్లకు అనుగుణంగా క్యాడర్ స్టెంత్ పెంచాల్సి ఉండగా, ప్రభుత్వం మాత్రం అందుకు అనుగుణంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దవాఖానలో అనేక విభాగాలు ఉండగా, ఒక్కో విభాగానికి మూడు యూనిట్లు ఏర్పాటు చేసినపుడే సరైన వైద్యం అందుబాటులోకి వస్తుందని, మెడికోలకు బోధన సరైన రీతిలో అందుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఒక్కో విభాగానికి రెండు యూనిట్లు మాత్రమే పని చేస్తున్నాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా వైద్య సిబ్బంది క్యాడర్‌ను పెంచి ప్రతి విభాగానికి మూడు యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.
ఉమ్మడి జిల్లా పరిధిలోని సిరిసిల్ల, జగిత్యాల, రామగుండంలోని ప్రభుత్వ దవాఖానలకు అనుబంధంగా మెడికల్ కళాశాలలు ఉన్నప్పటికీ రోగుల పరంగా చూసుకుంటే కరీంనగర్ దవాఖానపై ఉన్న ఒత్తిడి మిగతా వాటిపై ఉండదు. రాష్ట్రంలోని ఉస్మానియా, గాంధీ, కాకతీయ వైద్య సంస్థల తర్వాత అధికంగా రోగుల ఒత్తిడి ఉండేది కరీంనగర్ దవాఖానపైనే. ప్రతి రోజు 1,200 నుంచి 1,500 వరకు ఓపీ పేషెంట్లు వస్తుంటారు. కానీ, వీరిలో చాలా మందికి సరైన వైద్యం అందక నిరాశతో వెనుదిరిగే పరిస్థితి కనిపిస్తున్నది. నిత్యం 400 నుంచి 500 మంది ఇన్ పేషెంట్లుగా ఉండే వారికి పరిమిత వనరులు ఉన్నప్పటికీ వైద్యులు సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. మెరుగైన సదుపాయాలు, ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటే మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశాలు ఉండేవి.